కేసీఆర్ కు హుజూర్ నగర్ ఉప ఎన్నిక షాక్: చుట్టుముడుతున్న సమస్యలు

సభ రద్దైన నేపథ్యంలో రేపు మరో సభ పెట్టుకుందామంటే కుదిరే పని కాదు. జన సమీకరణ నుంచి మొదలు పోలీసు వారి అనుమతుల వరకు చాలా విషయాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అన్నింటిని మించి ప్రచారానికి కేవలం 48గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నాయకులందరినీ ఎన్నికల ప్రచారం నుంచి తప్పించి జన సమీకరణ కార్యక్రమాల్లో నిమగ్నమవ్వమనడం తెరాస కు ఆత్మహత్యాసదృశమే అవుతుంది. 

huzurnagr bypoll: more worries in the kitty for trs and its supremo kcr

 హుజూర్ నగర్: రాష్ట్రంలో రాజకీయ వాతావరణ వేడిని కొలిస్తే థర్మామీటర్లు పగిలిపోతాయా అన్న రీతిలో పరిస్థితి నెలకొని ఉంది. జరిగేది కేవలం ఒక స్థానానికి ఉప ఎన్నికే అయినా, అన్ని పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ ఉప ఎన్నిక వేళ హీట్ ని మరింత పెంచుతుంది ఆర్టీసీ సమ్మె. ఒకవైపేమో ఆర్టీసీ సమ్మె, మరోవైపేమో హుజూర్ నగర్ ఉప ఎన్నిక. ఈ రెండు అంశాల వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు చర్చించుకున్నా అందులో ఖచ్చితంగా ఈ టాపిక్ ఉండి తీరుతుంది. 

ఎలాగైనా తమ సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంటే, ఎలాగైనా కాంగ్రెస్ ని వారి సొంత సీట్లోనే ఓడించి విమర్శకుల నోర్లు మూయించాలని తెరాస సర్కార్ భావిస్తోంది. మరోపక్క తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షం మేమే అని నిరూపించుకోవడానికి ఇక్కడ ఎలాగైనా గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

హుజూర్ నగర్ ఉపఎన్నికలో కేవలం కొందరు తెరాస నేతలే మనకు ప్రచారంలో కనిపిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు మత్త్రమే ఎక్కువగా కనపడుతున్నారు. హరీష్ రావు, ఈటెల రాజేందర్ వంటి సీనియర్ నేతలు అసలు నియోజకవర్గంలో అడుగుపెట్టనే లేదు. తొలుత పూర్తి ప్రచార బాధ్యతలు భుజాన వేసుకొని అన్నీ తానై వ్యవహరించిన కేటీఆర్ అత్యంత కీలక సమయంలో ఎక్కడా స్క్రీన్ మీద కనపడక పోవడం గమనార్హం. 

నిన్న తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి  బుధవారం మీడియాతో మాట్లాడారు. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే తెలంగాణ ఉద్యమంలో ఏ మాత్రం పాత్ర లేని బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్ తో మాట్లాడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. యూటీ (ఉద్యమ తెలంగాణ) నేతలతో మాత్రమే తాము మాట్లాడుతామని ఆయన చెప్పారు.

ఉద్యమ సమయంలో తెరాస కోసం పనిచేసినవాళ్లు ఉద్యమ తెలంగాణ బ్యాచ్ గా, తెలంగాణ ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడుతున్నవారంతా బంగారు తెలంగాణ బ్యాచ్ గా మనకు కనపడతారు.    

ప్రస్తుతం ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిలో అత్యధికులు ఉద్యమంలో పాల్గొన్న అనుభవం ఉన్నవారుకాదు. వారికి ఉద్యమం ఎలా పుడుతుంది, ఎలా రూపాంతరం చెందుతుంది వంటి అంశాలపైన అవగాహనా లేదు. ప్రస్తుత రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఇదే కోవకు చెందినవారే. గులాబీ పార్టీకి ఇలాంటి ఉద్యమాలు కొత్త కాదు. కానీ ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ కు మాత్రం కొత్త. 

 ఇలా ఈ బంగారు తెలంగాణ, ఉద్యమ తెలంగాణ నేతల మధ్య ఉన్న తేడాను నేరుగా ఆర్టీసీ నేతలే మాట్లాడుతుండడంతో ఈ విషయం మరోసారి సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. వాస్తవానికి పరిశీలిస్తే ఆర్టీసీ సమ్మెపై కేటీర్ కానీ హరీష్ రావు కానీ ఇంతవరకు స్పందించలేదు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాగానే తొలుత అక్కడ వాలింది కేటీఆరే. ఆయన అక్కడ క్యాంపు వేసుకొని మరి రాజకీయ వ్యూహాలు రచించడం మొదలుపెట్టాడు. ఇద్దరు కార్మికుల ఆత్మ బలిదానాల నేపథ్యంలో సమ్మె ఉధృతంగా మారడంతో కేటీఆర్  అటు దిక్కు వెళ్లడం కూడా బంద్ చేసారు. 

ఈ ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడిగా పనిచేసిన హరీష్ రావు, ఇంతవరకు ఈ విషయంపై నోరు మెదపలేదు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై తొలుత స్పందించింది హరీష్ రావే. అలాంటి హరీష్ రావు ఇప్పటివరకు ఈ విషయంపై చిన్న మాట కూడా మాట్లాడకపోవడం తెరాస ఉద్యమ నేతల్లో ఈ విషయమై కలవరం మొదలయ్యిందా అనే అనుమానం కలుగక మానదు. 

ఈటెల రాజేందర్ మాట్లాడితే వివాదాస్పదమవుతోంది కాబట్టి ఆయన మాట్లాడలేదు అనుకుందాం. ఏకంగా హరీష్ రావు, కేటీఆర్ వంటివారు కూడా మాట్లాడకపోతుండడం నిజంగానే ప్రజలకు సమాధానం ఎలా చెప్పాలి అనే అంశంలో వీరు మదనపడుతున్నారని అర్థమవుతుంది. బహిరంగ సభలో వచ్చి ప్రసంగించి కెసిఆర్ వెళ్ళిపోతారు. కానీ కేటీర్ పరిస్థితి అదికాదు. రోడ్ షో లు నిర్వహిస్తూ, గ్రామాల్లో కలియతిరుగుతూ అందరిని పలకరిస్తుంటాడు. అటువంటి సమయంలో ఇబ్బందులెదురయితే అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. 

ఇదేదో కేవలంకేటీఆర్  వరకే పరిమితం కాలేదు. మిగిలిన సీనియర్ నేతలు కూడా బయటకు చెప్పట్లేదు కానీ లోలోన ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ఇబ్బందినెదుర్కోవలిసి వస్తుందో అని భయపడుతున్నారట. మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం సొంత జిల్లా అవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు. 

ఈ పరిస్థితులన్నంటిని నిశితంగా గమనిస్తున్న కెసిఆర్, తనయుడు కేటీఆర్ ను కూడా పక్కకు తప్పించి, తానే స్వయంగా రంగంలోకి దిగుదామనుకున్నారు. వాస్తవానికి కెసిఆర్ బహిరంగ సభ శుక్రవారం రోజు జరగాల్సి ఉన్నా, దాన్ని ఒక రోజు ముందుకు జరిపి గురువారం ఈ బహిరంగ సభలో ప్రసంగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకొని హైదరాబాద్ లో హెలికాప్టర్ ఎక్కే టైములో వాతావరణ పరిస్థితుల కారణంగా కెసిఆర్ పర్యటన రద్దయ్యింది.

మాటల మరాఠీగా పేరున్న కెసిఆర్ వచ్చి హుజూర్ నగర్ లో ప్రచారం చేస్తే ఆర్టీసీ సమ్మె విషయంలో  ఇబ్బందులు పడుతున్న తెరాస కు  మంచి బూస్ట్ దొరికేది. ఇప్పుడు ఆ సభ రద్దయ్యింది. ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే ఎన్నికకు సమయం మిగిలి ఉంది. ఎల్లుండి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనున్న నేపథ్యంలో ఇప్పుడు కెసిఆర్ సభ రద్దు కావడంతో తెరాస శ్రేణుల్లో కలవరం మొదలయ్యింది. 

ఒకపక్క కాంగ్రెస్ ఏమో ఆర్టీసీ సమ్మెపైన భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రతిపక్షం ఓట్లు చీలే పరిస్థితి కనపడడం లేదు, స్టార్ కామాపయినర్లు ఎవ్వరూ  దరిదాపుల్లో కూడా కనపడడం లేదు ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు కెసిఆర్ సభ కూడా క్యాన్సల్ అవడంతో తెరాస నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

ఇవాల్టి సభ రద్దైన నేపథ్యంలో రేపు మరో సభ పెట్టుకుందామంటే కుదిరే పని కాదు. జన సమీకరణ నుంచి మొదలు పోలీసు వారి అనుమతుల వరకు చాలా విషయాలు ఇందులో ఇమిడి ఉంటాయి. అన్నింటిని మించి ప్రచారానికి కేవలం 48గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో నాయకులందరినీ ఎన్నికల ప్రచారం నుంచి తప్పించి జన సమీకరణ కార్యక్రమాల్లో నిమగ్నమవ్వమనడం తెరాస కు ఆత్మహత్యాసదృశమే అవుతుంది. 

ఇప్పటికే జనసమీకరణలో నిమగ్నమవ్వడం వల్ల నిన్నటినుండి ప్రచార కార్యక్రమాలు రోజు నిర్వహించేంత పూర్తి స్థాయిలో చేపట్టలేకపోయింది. ముఖ్య నేతలూ అందుబాటులో లేక, కెసిఆర్ సభ రద్దయ్యి, ఇదే సమయంలో ఎన్నికల కమిషన్ కఠినంగా వ్యవహరించడం ఇవన్నీ వెరసి హుజూర్ నగర్ ఉప ఎన్నికపై తెరాస నాయకులు తలలు పట్టుకుంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios