హూజూర్‌నగర్:పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఈ స్థానాన్ని దక్కించుకోవాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించాయి.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఉంటూనే ఎంపీ స్థానానికి పోటీ చేశారు.

నల్గొండ ఎంపీ స్థానంలో  ఆయన విజయం సాధించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్యే స్థానానికి ఆరు మాసాల లోపుగా ఎన్నికలు జరపాలి. ఈ స్థానం ఖాళీ అయినట్టుగా ఎన్నికల సంఘానికి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సమాచారం పంపారు.

త్వరలోనే హూజూర్‌నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీ ఎన్నికల్లో కూడ హుజూర్ నగర్ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెజారిటీ వచ్చింది. హూజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో విజయం సాధించాలని టీఆర్ఎస్ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

వరుసగా ఆరు దఫాలు జరిగిన ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటమిపాలు కాలేదు. కోదాడ అసెంబ్లీ స్థానం నుండి రెండు దఫాలు, హుజూర్ నగర్ నుండి మూడు దఫాలు ఆయన విజయం సాధించారు. తాజాగా నల్గొండ ఎంపీ స్థానంలో కూడ గెలుపొందారు.

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ స్థానంలో హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో 7వేల ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు.టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డిపై ఆయన ఈ మెజారిటీని సాధించాడు.

ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 88 అసెంబ్లీ సీట్లు దక్కినా హుజూర్ నగర్ లో మాత్రం ఓటమి పాలైంది.అయితే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలుపొందడం టీఆర్ఎస్ కు మింగుడుపడడం లేదు. 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయాన్ని నమోదు చేసింది.ఈ ఎన్నికల్లో బీజేపీ నామమాత్రంగానే సీట్లను పొందింది.హూజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకొంది. 2014 లో ఆ పార్టీకి 963 ఓట్లు వచ్చాయి. 2018 నాటికి ఆ పార్టీ తన ఓటు బ్యాంకును 1555 కు పెంచుకొంది.