హైదరాబాద్: తెలంగాణాలో హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నగారా మోగడంతో అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచించడంలో నిమగ్నమయ్యాయి. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఇతర పార్టీలనేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ వారి లోపాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

తాజాగా భువనగిరి పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ కెసిఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణ ఆడపడుచుకు నియంత పాలనకు మధ్య జరుగుతున్న యుద్ధంగా ఈ ఉప ఎన్నికను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివర్ణించారు. 

ఈ ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసారు. హుజూర్ నగర్ ప్రజలు కాంగ్రెస్ కు మద్దతుగా నిలబడి ఓట్లు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేసారు. నియంత కెసిఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారని ఈ ప్రకటనలో కోమటిరెడ్డి తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పద్మావతి రేపు సోమవారం రోజున నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఇందులో తెలిపారు. ఈ నామినేషన్ వేసేందుకు వెళ్లే ర్యాలీలో తనతోపాటు భువనగిరి నుండి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని కోమటిరెడ్డి తెలిపారు. నామినేషన్ కార్యక్రమం ముగిసిన తరువాత అక్కడ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఈ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నట్టు కోమటిరెడ్డి తెలిపారు.