హైదరాబాద్: హుజూర్ నగర్ ఉప ఎన్నిక నగారా మోగడంతో తెలంగాణాలో రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. అన్ని పార్టీలు హుజూర్ నగర్ లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తున్నాయి. అధికార తెరాస ఎలాగైనా కాంగ్రెస్ నుంచి ఆ సీటును లాక్కోవాలని ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం హుజూర్ నగర్ పై తెరాస జెండాను ఎగరానిచ్చేదే లేదంటున్నాయి. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెరాస వైఖరిపై విరుచుకుపడ్డారు. ఉప ఎన్నికల్లో గనుక అధికార తెరాస గెలిస్తే వారికి అహంకారం మరింతపెరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. హుజూర్ నగర్ లో కాంగ్రెస్ గెలవడం కేవలం హుజూర్ నగర్ ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ తెలంగాణకు ఇది ఎంతో అవసరమని పొన్నం వ్యాఖ్యానించారు. 

ఆకాశంలో ఉన్న తెరాస ను నేలకు దించాల్సింది హుజూర్ నగర్ ప్రజలేనని స్పష్టం చేసారు. హుజూర్ నగర్ లో ఉప ఎన్నిక అనగానే అధికార తెరాస భయపడుతోందని ఎద్దేవా చేసారు. తెరాస గెలిస్తే కెసిఆర్ కుటుంబం మాత్రమే లాభపడుతుంది తప్ప తెలంగాణకు ఏ విధమైన ప్రయోజనం ఉండదని అన్నారు పొన్నం ప్రభాకర్. 

ప్రజాస్వామ్యం గెలవాలంటే కాంగ్రెస్ గెలవాల్సిందేనన్నారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాపాడాలన్నా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి బయటపడేయాలన్నా ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు అనివార్యమని అన్నారు. 

సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూమయ్య అరెస్టు గురించి ప్రస్తావిస్తూ, భూమయ్యను పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ విషయం తనకు తెలియదని ఏకంగా హోమ్ మంత్రిగారు ప్రకటన చేయడం మరీ విడ్డూరంగా ఉందన్నారు.