భర్తకు తెలియకుండా భార్య చేస్తోన్న ఛాటింగ్ ఓ కాపురాన్ని కూల్చేశాయి..ఓ చిన్నారిని అనాథను చేశాయి. వివరాల్లోకి వెళితే...కడప జిల్లా పులివెందుల మండలం గోటూరుకు చెందిన చరణ్ రెడ్డి ఐదేళ్ల కిందట ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు.

చింతల్‌లోని వాజ్‌పేయినగర్‌లో ఉంటూ... బంధువుల నర్సరీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో అతనికి విజయనగరం జిల్లాకు చెందిన పావనితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో రెండేళ్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కొడుకున్నాడు.

ఇటీవలి కాలంలో భార్య మొబైల్‌కు తరచుగా మెసేజ్‌లు వస్తుండటం, ఆమె చాటుగా ఛాటింగ్ చేస్తుండటంతో దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో మూడు రోజుల క్రితం పావని కుమారుడిని భర్త వద్ద వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.

అప్పటి నుంచి కొడుకును చూసుకుని పనికి వెళ్లడం చరణ్‌కు ఇబ్బందిగా మారింది. భార్య గుర్తొచ్చి, తీవ్ర మనోవేదనకు గురైన అతను జీవితంపై విరక్తి చెంది గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శుక్రవారం ఉదయం చిన్నారి ఏడుస్తూ ఉండటం, ఎంతకీ ఏడుపు మానకపోవడంతో చుట్టుపక్కల వారు స్పందించి లోపలికి వెళ్లి చూశారు. చరణ్ ఉరికి వేలాడుతూ ఉండటంతో అతని స్నేహితులకు సమాచారం అందించారు.

వారు అక్కడికి వచ్చి చరణ్ మరణవార్తను పావనికి తెలియజేశారు. ఆమె నమ్మకపోవడంతో భర్త మృతదేహాన్ని ఫోటో తీసి వాట్సాప్‌‌కు పంపారు. అయినప్పటికీ శుక్రవారం సాయంత్రం వరకు పావని స్పందించలేదు.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చరణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైసు తల్లిదండ్రులు ఇద్దరు కనిపించకపోవడంతో ఆ చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్నాడు. స్థానికులే పిల్లాడిని చేరదీస్తున్నారు.