మంచిర్యాల: ఇక్కడ సీన్ రివర్స్ అయింది. తనను వదిలేశాడని భార్యలు భర్త ఇంటి ముందు ధర్నాలు చేయడం చాలా చూశాం. కానీ, భర్త భార్య ఇంటి ముందు ధర్నా చేయడం కొత్తదే. మంచిర్యాలలో ఓ యువకుడు తన భార్యను కాపురానికి పంపించాలని కోరుతూ అత్తారింటి ముందు మౌన పోరాటానికి దిగారు. 

తన భార్యను తనతో పంపించాలని కోరుతూ ఓరుగంటి రామ్ కరణ్ అనే యువకుడు మౌన పోరాటానికి దిగాడు. పెద్దలను ఎదిరించి ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నానని, ఈ విధమైన రోజు ఒక్కటి వస్తుందని తాను అనుకోలేదని రామ్ కరణ్ అంటున్నాడు. మంచిర్యాలలోని జన్మభూమి నగర్ లో ఈ సంఘటన జరిగింది. 

లేఖ శర్మ అనే యువతిని రామ్ కరణ్ 2014 ఆగస్టు 23వ తేదీన పెళ్లి చేసుకున్నాడు. కరీంనగర్ జజిల్లా ఇల్లంతుకుంటలోని సీతారాముల ఆలయంలో వీరి ప్రేమ వివాహం జరిగింది. ఊహించని పరిస్థితి ఎదురు కావడంతో భార్యను అతను ఇటీవల పుట్టింటికి పంపించాడు. అయితే, రామ్ కరణ్ తో కాపురం చేయడం ఇష్టం లేదని, తనకు విడాకులు కావాలని లేఖ శర్మ కోర్టులో కేసు వేసింది. 

తన వద్దకు రావాలని రామ్ కరణ్ లేఖ శర్మను కోరుతూ వస్తున్నాడు. కోర్టులో న్యాయం జరుగుతుందనుకుంటే కరోనా వల్ల కోర్టులను మూసేశారు. దీంతో ఏం చేయాలో తెలియక భార్యను తనతో పంపించాలని రామ్ కరణ్ అత్తారింటి ముందు మౌన పోరాటానికి దిగాడు.