భార్య మెయిల్ ఐడీతో ఫేస్‌బుక్ ఖాతా తెరిచి పలువురికి అసభ్యకర దృశ్యాలు పంపిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోల్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో 2011-13లో నగరంలోని ఓ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్న యువతితో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు చనువుగా ఉండటంతో పాటు సినిమాలకు, షికార్లకు వెళ్లేవారు.

ఆ సమయంలో తన సెల్‌ఫోన్‌లో ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసుకున్నాడు. 2015లో ఆ యువతి మరో ఆసుపత్రిలో చేరడంతో.. అదే ఏడాది మార్చి 28న వనస్థలిపురంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

ఆ సమయంలో ఆమె మెయిల్ ఐడీని వినియోగించి తన సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. ఆ ఖాతాను మహిళ సైతం అప్పుడప్పుడు చూసేది. ఈ క్రమంలో గత జనవరిలో అతని సెల్‌ఫోన్‌లోని వాట్సాప్, ఫేస్‌బుక్ ఖాతాలను చూసి షాకయ్యింది.

అందులో పలువురు అమ్మాయిల ఫోన్ నెంబర్లు ఉండటంతో భర్తను నిలదీసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో అతను ఉద్యోగం వదిలి సొంతవూరికి వెళ్లిపోయాడు.

అక్కడితో ఆగకుండా ఆమె మెయిల్ ఐడీతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలో భార్యకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు.. అభ్యంతరకర చిత్రాలను పోస్ట్ చేయడం ఆరంభించాడు. ఈ వేధింపులతో సదరు మహిళ విసిగిపోయి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.