కట్టుకున్న భార్యను సుఫారీ ఇచ్చి మరీ దారుణంగా హత్య చేశాడు. ప్రియుడితో కలిసి తనను ఎక్కడ హత్య చేస్తుందోనని ముందుగానే భార్యను హత్య చేయించాడు. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ హత్య కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లోనే చేధించడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... మెదక్ లోని హవేళిఘణనాపూర్ మండలం ఔరంగాబాద్ తండా పంచాయితీకి చెందిన ఓ వ్యక్తి కొద్దికాలం క్రితం బతుకు దెరువు కోసం సింగపూర్ వెళ్లాడు. భార్యను మాత్రం ఇక్కడే ఉంచి తాను మాత్రం వెళ్లాడు. భర్తలేని సమయంలో ఆమె ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

సంవత్సరం తర్వాత సింగపూర్ నుంచి వచ్చేసిన ఆమె భర్త గ్రామంలోనే కూలి పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి తాను లేని సమయంలో భార్య మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయంలో భార్యను మందలించాడు కూడా.కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో..  ఎక్కడ ప్రియుడితో కలిసి తనను చంపుతుందో అనే భయంతో తాను భార్యను చంపాలని ప్లాన్ వేశాడు.

ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం తన బంధువులను రూ.10వేలు సుఫారీ ఇచ్చి భార్యను చంపాలని పురమాయించాడు. భార్యను తీసుకొని సినిమాకి వెళ్లాడు. అక్కడ ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. ఆ తర్వాత ఓ చెట్టువద్దకు ఆమెను తీసుకువెళ్లి.. తన బంధువులకు అప్పగించాడు. తాను మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

వాళ్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమె చీరతోనే ఉరివేసి హత్య చేశారు. కాగా... భార్య చనిపోయిందన్న విషయం ఫోన్ ద్వారా తెలుసుకొని భార్య తనతోపాటు సినిమాకి వచ్చి తర్వాత ఎక్కడికో వెళ్లిందని నమ్మబలికాడు. రెండు రోజుల తర్వాత ఆమె శవమై కనిపించింది. ఏమీ ఎరగనట్టు భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు  చేసిన పోలీసులు నాలుగు రోజుల్లో భర్తే హంతకుడని తేల్చి చెప్పారు. అతనిని, చంపిన వారిని అదుపులోకి తీసుకున్నారు.