ప్రియుడితో కలిసి.. భర్తను చంపేందుకు ప్లాన్ వేసింది. చివరకు.. ఆ భర్త చేతిలో ప్రియుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోని బీఎన్ రెడ్డిలో ఇటీవల చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం బీఎన్ రెడ్డి నగర్ లో ఓ వ్యక్తిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు,వేట కొడవళ్లతో నరికి చంపిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ హత్య కేసును పోలీసులు చేధించారు. ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉర్వకొండ మండలం రచలాపల్లి గ్రామానికి చెందిన జి.శ్రీధర్‌రెడ్డి కుటుంబంతో కలిసి 2014లో కల్వకుర్తికి వచ్చి అద్దెకు ఉండేవాడు. తిమ్మరాసిపల్లి గ్రామానికి చెందిన గిరి శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీధర్‌రెడ్డి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యపై అనుమానం వచ్చి శ్రీధర్‌రెడ్డి సొంతూరుకు వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లినా శ్రీనివాస్‌గౌడ్‌ ఆమెను కలిసేవాడు. 

ఆమెతో దిగిన ఫొటోలను శ్రీనివాస్‌గౌడ్‌ వేరే నంబర్లతో శ్రీధర్‌రెడ్డికి పంపించి వేధించేవాడు. శ్రీధర్‌రెడ్డి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబరు 20న శ్రీనివాస్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. ఈలోగా శ్రీధర్‌రెడ్డి భార్యతో విడాకులు కావాలని మహబూబ్‌నగర్‌ కోర్టులో పిటిషన్‌ వేశాడు. ప్రతి నిమిషం శ్రీనివాస్ గౌడ్ విసిగిస్తుండటంతో తట్టుకోలేకపోయాడు.

దీంతో గత నెల 29వ తేదీన పథకం తన అనుచరులతో కలిసి హత్య చేయించాడు. భార్యను కూడా చంపుదామనుకున్నాడు కానీ.. ఆమె దొరకకపోవడంతో శ్రీనివాస్ గౌడ్ ని మాత్రమే హతమార్చాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.