భార్యభర్తల మధ్య చిన్నపాటి గొడవలు రావడం సహజం. ఆ గొడవ కాస్త ఎక్కువ కావడంతో... ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు.  కాగా... భార్యను హత్య చేసిన అనంతరం  శవం పక్కనే భర్త జాగరణ చేశాడు. కుటుంబసభ్యులకు, బంధువులకు ఆత్మహత్య చేసుకుందని చెప్పి నమ్మించాలనే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం రేగుళ్లతండాకు చెందిన భూక్య సోమేశ్వర్ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి పెద్ద చర్లపల్లిలోని రామాలయం వెనక వీధిలో అద్దెకు ఉంటున్నాడు. చర్లపల్లిలోని ఓ కంపెనీలో వెల్డర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అతనికి భార్య శారద(36), ఇద్దరు కుమారులు ఉన్నారు. శారద మరో కంపెనీలో పనిచేస్తోంది. పిల్లలు ఇద్దరూ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు. కాగా... కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి విధుల నుంచి ఇంటికి వచ్చిన సోమేశ్వర్ మద్యం సేవించాడు. మద్యం మత్తులోనే భార్యతో గొడవకు దిగాడు.

భార్య ఎదురు చెప్పడంతో కోప్పడి భార్య శారద తలను గోడకేసి కొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రాత్రంతా భార్య శవంపక్కనే జాగారం చేసిన సోమేశ్వర్ పొద్దునే పోలీస్ స్టేషన్ కి వెళ్లి భార్య ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశాడు. అయితే... ఆమె చనిపోయిన తీరు అనుమానాస్పదంగా ఉండటంతో... పోలీసులు సోమేశ్వర్ ని గట్టిగా నిలదీశారు. దీంతో తానే హత్య చేశానని నిజం అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.