హైదరాబాద్: మూడు రోజుల కిత్రం అదృశ్యమైన ఓ మహిళ వారింట్లోనే శవమై తేలింది. ఆ సంఘటన హైదరాబాదులోని పాతబస్తీలో గల హఫీజ్‌పేటలోని సాయినగర్‌లో బుధవారం రాత్రి వెలుగుచూసింది. స్థానికంగా తన భర్తతోపాటు నివాసముంటున్న షాజియా ఈ నెల 21 మధ్యాహ్నం నుంచి అదృశ్యమైంది.

తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త సాజోద్దీన్‌ మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాజోద్దీన్‌ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. 

నీటి సంపులో షాజియా మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న ఆమె పుట్టింటివారు ఘటనాస్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. సాజియాను హత్యచేసింది సాజోద్దీనే అని ఆరోపిస్తూ దాడికి దిగారు. దీంతో సాయినగర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

స్థానికులు కూడా సాజియా తరపు వారిపై ప్రతిదాడి చేసేందుకు యత్నించగా.. పోలీసు బలగాలు రంగంలోకి వారిని అడ్డుకున్నారు. సాజోద్దీన్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతురాలి అత్తింటివారు ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.