చాలా మంది అబ్బాయిలు తమకు అందంగా ఉన్న అమ్మాయే భార్యగా రావాలని కలలు కంటూ ఉంటారు. అయితే.. ఓ వ్యక్తి మాత్రం తన భార్య తనకంటే ఎక్కవ అందంగా ఉందని హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా చిట్యాలకు చెందిన నాగరాజు, జవలమ్మ(27) దంపతులు బతుకు దెరువు కోసం పదేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు. వీరికి కార్తీక్, రిషి అనే సంతానం కూడా ఉన్నారు. దంపతులు ఇద్దరూ వెంగళరావు పార్కు రోడ్డులో తోపుడు బండ్లపై కొబ్బరి బోండాలు అమ్మకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే.. గత కొంతకాలంగా నాగరాజులో అనుమానం అనే పెనుబూతం ఆవహించింది.దీంతో.. భార్యను రకరకాలుగా వేధించడం మొదలుపెట్టేవాడు. తనకన్నా భార్య అందంగా ఉందంటూ.. ఆమెను కొట్టేవాడు. ఆ అందంతో పరాయి మగాళ్లకు ఆకర్షిస్తోందంటూ ఆరోపించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో గురువారం పీకలదాకా మద్యం తాగివచ్చి భార్యపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్రగాయమై.. అక్కడికక్కడే మృతి చెందింది.

వెంటనే విషయాన్ని బంధువులకు తెలియజేసి.. పరారయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పలీసులు తెలిపారు.