ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యపై కోపం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని ప్రతిసారీ గుర్తు చుస్తూ... భార్యను నారా రకాలుగా వేధించేవాడు. చివరకు మద్యం మత్తులో భార్య గొంతు నులిమి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యాదగిరిగుట్ట మండలం, కొల్లేర్‌ గ్రామానికి చెందిన బుగ్గా పద్మ(32)కు 12 ఏళ్ల క్రితం భువనగరి మండలం, కూనూరు గ్రామానికి చెందిన బుగ్గా బాబుతో వివాహం జరిగింది. డ్రైవర్‌గా పని చేసే బాబు కుటుంబంతో కలిసి ఎన్‌బీటీనగర్‌లో ఉంటున్నాడు. వీరికి హర్షిత, శ్రీవర్షిణి, చిత్ర  ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురు హాస్టల్‌లో ఉండగా, మిగతా ఇద్దరూ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కాగా మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో అప్పటి నుంచి బాబు పద్మను వేధిస్తున్నాడు.

ముగ్గురు ఆడపిల్లలే పుట్టారని తరచూ ఆమెను కొట్టేవాడు. సోమవారం ఉదయం మద్యం మత్తులో అతను భార్యను తీవ్రంగా కొట్టాడు. దీంతో పద్మ కుమార్తెలను స్కూలుకు వెళ్ల వద్దని చెప్పింది. అయినా బాబు వినిపించుకోకుండా పిల్లలిద్దరినీ బలవంతంగా స్కూల్‌లో దించి ఇంటికి వచ్చి భార్యను చితక బాదాడు. 

తలుపులు వేసి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పద్మ సోదరుడికి ఫోన్‌ చేసి మీ చెల్లి చనిపోయిందని చెప్పి ఇంట్లోంచి పరారయ్యాడు. దీంతో ఇంటికి వచ్చిన పద్మ సోదరుడు చెల్లెలి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు బాబును అరెస్ట్‌ చేశారు.