వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిచేసుకున్నారు. అలా ఒకరికోసం ఒకరు ప్రాణాలను కూడా త్యాగం చేసే స్థితిలో వున్న వారి జీవితాల్లోకి మద్యం మహమ్మారి ప్రవేశించింది. ఇంకేముందు మద్యానికి బానిసైన భర్త ఆ మత్తులో విచక్షణ కోల్పోయి తాను ప్రాణంగా ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య గర్భవతి అనికూడా చూడకుండా దారుణంగా చంపేశాడు. ఈ దారుణం రాజధాని నగరం హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

సికింద్రాబాద్ పరిధిలోని  వెస్ట్‌మారేడ్‌పల్లి వాల్మీకినగర్‌ కు చెందిన సన్ని బిల్టన్(30), సత్యవతి (27) లు ప్రేమించుకున్నారు.. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి పెళ్ళికి అంగీకరించలేదు. దీంతో వారిని ఎదిరించి ఐదేళ్లక్రితమే పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులు తమ కుటుంబాలకు దూరంగా వేరుగా కాపురం పెట్టారు. బిల్టన్ ఓ సాప్ లో పనిచేస్తుండగా, సత్యవతి పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఇలా అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలోకి మద్యం మహమ్మారి ప్రవేశించింది. తాగుడుకు బానిసైన బిల్టన్ నిత్తం ఇంటికి తాగొచ్చి భార్యతో గొడవపడటం ప్రారంభించాడు. 

అయితే ప్రస్తుతం సత్యవతి గర్భవతిగా  వుంది. ఈ క్రమంలో సోమవారం రగత సోమవారం రాత్రి బిల్టన్ అతిగా మధ్యం సేవించి వచ్చి భార్య సత్యవతితో మళ్లీ గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగడంతో కోపోద్రిక్తుడైన బిల్టన్ సత్యవతి గొంతు నులిమి చంపేశాడు. 

తెల్లవారుజామున సత్యవతి మ‌ృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బిల్టన్ ను అరెస్ట్ చేశారు.