ప్రేమ పెళ్లి చేసుకొని ఆనందంగా గడుపుతున్న నూతన దంపతుల మధ్య వెండి రాఖీ చిచ్చు పెట్టింది. రాఖీ కోసం భార్య , భర్తలు గొడవపడ్డారు. దీంతో మనస్తాపం చెందని భర్త ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... వరంగల్ ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన రవీంద్రాచారి(23) రెండు నెలల క్రితం వరంగల్ రూరల్ జిల్లా గుడెప్పాడ్ గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. హన్మకొండ కొత్తూరు, సుభాష్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు నివసిస్తున్నారు. కాగా రవీంద్రాచారి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

ఇటీవల ఫైనాన్స్ కట్టలేదని ఆటోని ఫైనాన్స్ అధికారులు తీసుకువెళ్లారు. దీంతో... ఆటో చేతిలో లేకపోవడంతో అతని దగ్గర డబ్బులు లేకుండాపోయాయి.  కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. అలాంటి సమయంలో భార్య... తన సోదరులకు కట్టేందుకు వెండి రాఖీలు కావాలని కోరింది. అసలే డబ్బులేక చస్తోంటే... వెండి రాఖీలు కావాలని అడిగేసరికి... వద్దని భార్యను మందలించాడు.

భార్య వినిపించుకోకపోగా.... గొడవపడింది. ఈ క్రమంలో మనస్తాపం చెందిన రవీంద్రాచారి.. భార్య నిద్రించిన తర్వాత హాలులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఉదయం నిద్రలేచి చూసేసరికి భర్త శవమై కనిపించాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.