హైదరాబాద్: రాష్ట్రంలో పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద రూ.800 కోట్ల వ్యవయంతో చేపట్టిన ఐటీసీ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తైనట్లు తెలిపారు. 

శనివారం సీఎం కేసీఆర్‌ను ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పూరి, తన సభ్యులతో కలిశారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తయినట్లు సీఎంకు తెలిపారు. వేగంగా నిర్మాణం పూర్తి చేసినందుకు ఐటీసీ ఛైర్మన్‌ను సీఎం కేసీఆర్ అభినందించారు.  

రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించాలన్నదే తన ధ్యేయమన్నారు. ప్రజలకు నాణ్యమైన, కల్తీలేని ఆహార పదార్థాలు అందించాలని సూచించారు. 

రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మహిళా సంఘాలు ఉన్నాయని ముడి సరుకు సేకరణతోపాటు ఇతర అంశాల్లో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసుకోవాలంటూ సూచించారు. మరోవైపు రాష్ట్రంలో దాదాపు 500 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాలు సిద్ధమవుతున్నాయని స్పష్టం చేసిన కేసీఆర్ జలాశయాల చుట్టూ పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలోనూ ఐటీసీ కలిసి రావాలని కేసీఆర్ కోరారు.