తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో చిప్ ద్వారా జరుగుతున్న మోసాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సైబరాబాద్ పోలీసులు చిప్‌లను తయారు చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం మీడియాకు వివరించారు. షేక్ సుభానీ అలియాస్ భాషా ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్నారని సీపీ తెలిపారు.

అతనితో పాటు ముఠా సభ్యులందరిదీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అని ఆయన చెప్పారు. గ్యాంగ్‌లోని ఇద్దరు సుభానీ బంధువులు కాగా... మిగిలిన ఇద్దరు బయటి వ్యక్తులు. సుభానీకి తూర్పు, పశ్చిమ గోదావరిల్లోని పెట్రోల్ బంకుల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు మెకానిజం కూడా తెలుసునని సజ్జనార్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో పెట్రోల్ బంకుల్లో ఏ విధంగా మోసం చేయొచ్చనే దానిపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత సుభానీ చిప్స్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన జో జోసెఫ్, థామస్ అనే ఇద్దరితో కలిసి సాఫ్ట్‌వేర్, చిప్‌లను సుభానీ తయారు చేయించినట్లు సజ్జనార్ పేర్కొన్నారు.

పెట్రోల్ బంకుల్లో చిప్‌లను ఇన్‌స్టాల్ చేసినందుకు గాను ఒక్కో చిప్‌కు రూ.80 వేల నుంచి రూ.1.20 వేలు తీసుకుంటారని ఆయన తెలిపారు. దీని వల్ల బంకు యజమానులకు లక్షల్లో అదనపు ఆదాయం వచ్చేదని సీపీ పేర్కొన్నారు.

ఈ ముఠా సభ్యులు రెండు రకాల మార్గాల ద్వారా చిప్‌లను ఇన్‌స్టాల్ చేస్తారని సజ్జనార్ వివరించారు. అలాగే క్యాన్, బాటిల్‌లో పెట్రోల్ పోయించుకునేవారికి అనుమానం రాకుండా మరో పంప్ ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు.

ఇలాంటి మోసాలను అరికట్టడానికి 2018లో ఆయిల్ కార్పోరేషన్లు దేశవ్యాప్తంగా వున్న పెట్రోల్ బంకుల్లో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లు సీపీ తెలిపారు. ఆ సమయంలో ఈ ముఠా దానిని అర్థం చేసుకుని మరో కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా చిప్‌లను రూపొందించారని సజ్జనార్ పేర్కొన్నారు.

ఈ నలుగురు ముఠా సభ్యులు ఇప్పటి వరకు 11 బంకుల్లో ఈ తరహా చిప్‌లను అమర్చినట్లు ఆయన వివరించారు. ఏపీలో 22 చోట్ల ఈ చిప్‌లను ఇన్‌స్టాల్ చేశారని సీపీ పేర్కొన్నారు. ఈ ముఠా సభ్యుల్లో 9 మందిని తెలంగాణలో, 19 మందిని ఆంధ్రప్రదేశ్‌లో అరెస్ట్ చేసినట్లు సజ్జనార్ వివరించారు.

ఈ కుంభకోణంలో ఐదుగురు బంకు యజమానులు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు. నిందితుల నుంచి 13 చిప్‌లు, 8 డిస్‌ప్లే బోర్డులు, 3 జీడీఆర్ కేబుళ్లు, ఒక మదర్ బోర్డు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.