హైదరాబాద్: రూ. 10.50 లక్షల లంచం తీసుకొంటూ హెచ్ఎండీఏ అధికారి శుక్రవారం నాడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు.హైద్రాబాద్ నానక్ రామ్ గూడలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో హెచ్ఎండీఏ అధికారి ప్రకాష్  కార్యాలయంలో ఇవాళ ఏసీబీ అధికారులు  ఆకస్మాత్తుగా తనిఖీలు నిర్వహిస్తే లెక్కల తేలని రూ. 10.50 లక్షలను గుర్తించారు.ఈ డబ్బులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

ఔటర్ రింగ్  రోడ్డు ప్రాంతంలో మొక్కల పెంపకానికి సంబంధించి బిల్లుల చెల్లింపు కోసం లంచాలు తీసుకొంటున్నట్టుగా ప్రకాష్ పై ఫిర్యాదులు అందాయి. దీంతో గచ్చిభౌలిలోని నానక్‌రామ్ గూడలోని ఆయన కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ. 10.50 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. ఈ డబ్బులకు సంబంధించి ప్రకాష్ సరైన సమాచారం ఇవ్వలేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. 

ప్రకాష్ నివాసంతో పాటు ఆయన కార్యాలయంలో కూడ ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ప్రకాష్ కారులో రూ. 19 వేల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.

ఈ  కార్యాలయంలో ఇతరుల వద్ద ఎక్కడా కూడ భారీ మొత్తంలో డబ్బులు దొరకలేదని ఏసీబీ అధికారులు చెప్పారు.  కాంట్రాక్టర్లు ఇచ్చి ఉంటారా అనే కోణంలో కూడ ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

బిల్లుల చెల్లింపునకు సంబంధించి లంచం తీసుకొంటున్నాడని  తమకు కచ్చితమైన సమాచారం అందిందని ఏసీబీ అధికారులు తెలిపారు.ఎక్కడి నుండి ఈ డబ్బులు వచ్చాయనే విషయమై ప్రకాష్ సమాచారం ఇవ్వలేదని ఏసీబీ అధికారి చెప్పారు.