హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని హయత్ నగర్ వద్ద ఒక అద్దె బస్సు రోడ్డుపైన బీభత్సం సృష్టించింది. బస్సు అదుపుతప్పి తొలుత ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును ఢీకొట్టి డివైడర్ మీద ఉన్న విద్యుత్ పోల్ ను ఢీకొని డివైడర్ మీదుగా రోడ్డుకు అవతలివైపుకు దూసుకెళ్లింది. 

ఈ సంఘటనలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. అతడిని పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో బస్సును నడిపాడని ప్రయాణికులు డ్రైవెర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. 

మద్యం మత్తులో వాహనం నడిపి బీభత్సం సృష్టించిన డ్రైవర్ పై ప్రజలు దాడికి పాల్పడ్డారు. అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొనేసరకు పరిస్థితి సద్దుమణిగింది.  ఈ సంఘటన వల్ల ట్రఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు బస్సును పక్కకు తొలిగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.