హిజ్రాలను టార్గెట్ చేసుకొని.. వారిని దారుణంగా హత్య చేసి.. వారిదగ్గర నగదు, బంగారం దోచుకెళ్తున్న ఓ రౌడీ షీటర్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కమ్మరి వెంకట్ యాదవ్ అనే రౌడీ షీటర్ ఇప్పటి వరకు రెండు హత్యలు, 9 దోపిడీ, దొమ్మి కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. కాగా.. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు రోజుకో మారువేషంలో తిరుగుతున్నాడు. కాగా.. ఎట్టకేలకు అతనిని పోలీసులు పట్టుకోగలిగారు.

కాగా.. అతను కేవలం హిజ్రాలపైనే దాడులు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. 2015లో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రవళిక అనే హిజ్రాను రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇందిరానగర్‌లో యాస్మిన్‌ అనే హిజ్రాపై దాడి చేసి నగలు, నగదు దోచుక్కెళ్లాడు. 

అప్పటినుండి తప్పించుకు తిరుగుతున్న వెంకట్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. అయితే, గత నెలలో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో స్వప్న అనే హిజ్రాపై దాడి చేసి నగదు దోచుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఖైత్లాపూర్‌లో హిజ్రాలను సమావేశపరిచి వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేశాడు.

 ఇప్పటిదాకా అతడిపై 11 కేసులు నమోదై ఉన్నాయి. 2008లో దివ్య అనే హిజ్రాతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతను హిజ్రాలందరితో పరిచయం పెంచుకున్నాడు. కాగా.. బాధిత హిజ్రాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని ఎట్టకేలకు అరెస్టు చేయగలిగారు.