ఇంటికి దోషం ఉందని నమ్మించి బంగారం, వెండి నగలతో ఉడాయించిందో హిజ్రా. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాలలో వెలుగు చూసింది. 

సిద్దిపేట : తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఓ మోసపూరితమైన ఘటన వెలుగు చూసింది. మూఢనమ్మకాలు ఓ వ్యక్తిని నిలువునా ముంచేశాయి. ఇంటికి దోషం ఉందంటూ నమ్మించిన ఓ హిజ్రా.. వారి నగలతో ఉడాయించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మూఢనమ్మకాలతో ఆస్తి, పరువు నష్టాలు జరుగుతాయని తెలిసి కూడా వాటిని నమ్మకుండా ఉండలేకపోతున్నారు. తీరా మోసపోయిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

చేర్యాలలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. మధు చేర్యాల నివాసి. గత కొన్నేళ్లుగా అతనికి ఏపీలోని విజయవాడకు చెందిన అబీద్ షేక్ మస్తాన్ అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓసారి చేర్యాలలోని తన ఇంటికి మస్తాన్ ను తీసుకువెళ్లాడు మధు. అతని ఇంటిని చూసిన మస్తాన్ కి దురాశ పుట్టింది.ఇంట్లోని నగలు, వెండి చూసి వాటిని ఎలాగైనా ఎత్తుకెళ్లాలనుకున్నాడు. దీనికోసం ఓ ప్లాన్ వేశాడు.

ఐఐటీ విద్యార్థిని మమైతాఖాన్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రెండు సూసైడ్ లెటర్లు..

దానికోసం వెయిట్ చేశాడు.వారు అనుకున్న సమయం రానే వచ్చింది. మధు ఇంట్లో దోషం ఉందని మస్తాన్ నమ్మించాడు. దోష నివారణ కోసం అమ్మవారిని నగలతో అలంకరించి పూజ చేయాలని.. అప్పుడు దోషం పూర్తిగా పోతుందని చెప్పాడు. మస్తాన్ చెప్పిన విషయాన్ని మధు గుడ్డిగా నమ్మాడు. హిజ్రా చెప్పినట్టుగానే ఐదు తులాల బంగారం, 5 తులాల వెండి గొలుసులను అమ్మవారి విగ్రహానికి పెట్టాడు. హిజ్రా మస్తాన్ తో పూజ చేయించాడు. 

ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని పాతిపెట్టాలని.. నగలను తీయాలని నమ్మించి మధుని ఓ చెరువు దగ్గరికి తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మధును గుడి దగ్గర కూర్చోబెట్టాడు. ఇప్పుడే వస్తానని చెప్పాడు. ఆ తర్వాత నగలతో ఊడయించాడు. ఎంతసేపైనా మస్తాన్ రాకపోవడంతో మధు వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ హిజ్రా మస్తాన్ కనిపించలేదు.

చుట్టుపక్కల వెతికినా హిజ్రా జాడ లేదు. దీంతో తాను మోసపోయానని మధుకు అర్థమైంది. వెంటనే మధు పోలీసులను ఆశ్రయించాడు. తనను నమ్మించి.. బంగారం, వెండి నగలతో హిజ్రా పరార్ అయ్యాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సొమ్ము తనకు ఇప్పించాలని.. నమ్మించి మోసం చేసిన హిజ్రాకు తగిన బుద్ధి చెప్పాలని పోలీసులను కోరాడు. మధుఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హిజ్రా మస్తాన్ నివాసం ఎక్కడ? మధునే ఎందుకు టార్గెట్ చేశాడు? మస్తాన్ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? అనేకోణంలో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి హిజ్రాలు, బాబాలు చెప్పే వాటిని విని మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.