తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు అనుమతించింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని రెండు రోజుల కిందట సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది.

దీనిపై న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది. ఎన్నికలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే ఎన్నికలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కూడా తెలిపింది.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. అయితే జనవరి 10 లోపు ఎన్నికల నిర్వహించాలని ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టింది.

దీనిపై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. కాగా, ఇప్పటికే ఎన్నికల కసరత్తు పూర్తి చేసిన ఈసీ, కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లతో అభ్యర్ధులకు స్థానాలు ఖరారవుతాయి.

ఇప్పటికే గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13 నుంచి 14 వరకు గ్రామాల్లో బీసీ ఓటర్ల జాబితాను ప్రచురించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది.