ఆదివాసీల పొడు భూముల వ్యవహారం తెలంగాణలో హాట్ హాట్ గా మారింది. తాజాగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయిపోషగూడలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల్లో ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ అధికారులు తరలించడం వివాదానికి కారణమైంది. 

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయిపోషగూడలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూముల్లో ఆదివాసీలు వేసుకున్న గుడిసెలను అటవీ శాఖ అధికారులు తరలించారు. అయితే అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూమిలో తాము గుడిసెలు వేసుకుంటే ఎందుకు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇకపోతే.. ఆసిఫాబాద్ జిల్లాలో పోడు భూముల విషయమై గత నెల 28న గిరిజన రైతులతో అధికారులు చర్చలు జరపగా, అవి విఫలమయ్యాయి. తమ సమస్య పరిష్కరించే వరకు అధికారులను గ్రామం దాటకుండా అడ్డుకుంటామని గిరిజనులు తేల్చి చెప్పారు. 

అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న గిరజనులపై అటవీశాఖాధికారులు ఈ నెల 26న దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడితో గిరిజనులు ఇతర ప్రాంతానికి వెళ్లారు. గిరిజన మహిళలపై ఫారెస్ట్ అధికారులు బెల్ట్ లతో దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. 

ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో చంద్రుగొండ మండలం ఎర్రబోడులో గిరిజనులు పోడు భూములు సాగు చేసుకొంటున్నారు. దాదాపుగా 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలోనే ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చిన గిరిజనులు నివాసం ఉంటున్నారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేసుకుంటున్నారు. దాదాపుగా 15 రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులకు అటవీశాఖాధికారుల మధ్య ఘర్షణలు సాగుతున్నాయి.