హత్యకు గురైన హైకోర్టు న్యాయవాది వామన్ రావు స్వగ్రామం గుంజపడుగులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు భారీ ర్యాలీ చేపట్టారు.

ఈ ర్యాలీని టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటారేమోనన్న ఉద్దేశంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా వామన్ రావు కుటుంబసభ్యులను లాయర్లు పరామర్శించారు. 

ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బస్సులలో బయలుదేరిన బీజేపీ లీగల్ సెల్ బృందం పలు జిల్లాల మీదుగా ప్రయాణం కొనసాగించి మొదట హత్యా స్థలాన్ని సందర్శించి, తదనంతరం మంథని మండలం గుంజపడుగు లోని న్యాయవాద కుటుంబాన్ని పరామర్శించింది.

ఈ సందర్భంగా బీజేపీ లీగల్ సెల్ నాయకులు మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో న్యాయవాదుల పాత్ర ఎంతో ఉందని, అలాంటి న్యాయవాదులకు నేడు రాష్ట్రంలో ప్రభుత్వం రక్షణ లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని కక్ష గట్టి హత్య చేయడం దారుణం అన్నారు.