హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల బృందం మరోసారి భేటీ అయ్యింది. ప్రగతి భవన్ వేదికగా సమావేశమైన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు శుక్రవారం నాటి సమావేశంలో ముఖ్యమంత్రులు కేసీఆర్, వైయస్ జగన్మోహన్ రెడ్డిలు సూచించిన అంశాలపై చర్చించారు. 
 
షెడ్యూల్ తొమ్మిది, పదిలోని సంస్థల విభజన, ఆంధ్రప్రదేశ్ ఆస్తుల విభజన, ఇతర నిధుల విభజనకు సంబంధించిన అంశాలపై చర్చించారు.  ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలపై ఉన్నతాధికారులు చర్చించారు. 

సమావేశంలో ఆస్తుల పంపకానికి ఏకాభిప్రాయానికి వస్తే జూలై 3న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. ఆస్తుల విభజనకు సంబంధించి నివేదికను గవర్నర్ నరసింహన్ కు సమర్పించే అవకాశం ఉంది. 

ఇకపోతే ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎస్ కే జోషి, ఎల్వీ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అజయ్ కల్లమ్, ఆర్ధిక మరియు ఎస్ ఆర్ ముఖ్యకార్యదర్శిలు రామకృష్ణారావు, రాజేశ్వరరావులు పాల్గొన్నారు.