హైదరాబాద్: ఎర్రమంజిల్‌లో  అసెంబ్లీ నిర్మాణాన్ని నిరసిస్తూ  దాఖలైన పిటిషన్‌పై  శుక్రవారం నాడు  హైకోర్టు విచారణ జరిపింది. అసెంబ్లీ నిర్మాణంపై  తన వాదనను తెలపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. విచారణను  జూలై 8వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

ఎర్రమంజిల్‌లో హెరిటేజ్ భవనాన్ని కూల్చేసి అసెంబ్లీ భవనాన్ని నిర్మించేందుకు తెలంగాణ సర్కార్  ప్లాన్ చేసింది. ఈ భవన నిర్మాణ పనులకు కేసీఆర్ గురవారం నాడు శంకుస్థాపన చేశారు.

అయితే ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవనాన్ని నిర్మించడాన్ని నిరసిస్తూ పిటిషన్‌పై శుక్రవారం నాడు వాదనలు జరిగాయి.పురాతన(హెరిటేజ్) భవనాలను  కూల్చివేయడం సరైంది కాదని  పిటిషనర్  హైకోర్టుకు వివరించారు.

హెరిటేజ్ కమిటీ నివేదికను హైకోర్టుకు పిటిషనర్ సమర్పించారు.  ఎర్రమంజిల్ లో అసెంబ్లీ భవనం నిర్మిస్తే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందని  పిటిషనర్ వ్యాఖ్యానించారు.

గూగుల్ మ్యాప్ ద్వారా ఎర్రమంజిల్ ఛాయాచిత్రాన్ని హైకోర్టు పరిశీలించింది.. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తే ఏ రకమైన ఇబ్బందులు ఎదురౌతాయో పూర్తి ఆధారాలతో ఇవ్వాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం నిర్మిస్తున్న స్థలంతో పాటు ఇతర స్థలాలను కూడ పరిశీలించాలని పిటిషనర్ కోరారు. ఎర్ర మంజిల్ లో చేపడుతున్న నిర్మాణాల వివరాలను  ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. నాంపల్లిలో ఉన్న అసెంబ్లీ భవనం ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించిన విషయాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారని న్యాయవాది గుర్తు చేశారు.

ఎర్రమంజిల్ లో అసెంబ్లీని నిర్మిస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉందని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. గూగుల్ మ్యాపుతో పాటు అసెంబ్లీ భవనాల డిజైన్లను ఇవ్వాలని కోర్టు  ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది.