హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కేసులో ఆ సంస్థ యజమాని ఆశోక్‌  పోలీసుల నోటీసులకు సమాధానం ఇవ్వాలని  హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

ఐటీ గ్రిడ్ కేసుకు సంబంధించి సోమవారం నాడు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఐటీ గ్రిడ్ కేసులో ఆశోక్‌కు తెలంగాణ పోలీసులు జారీ చేసిన నోటీసులపై సమాధానం ఇవ్వాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.

అయితే ఈ విషయమై ఆశోక్ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కానీ, తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఐటీ గ్రిడ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశోక్ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈ తరుణంలో ఆశోక్ తరపున న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మరో వైపు ఆశోక్‌ను అరెస్ట్ చేయకూడదని కూడ న్యాయవాది కోర్టును అభ్యర్ధించారు. 

అయితే ఈ సమయంలో ఈ విషయమై తాము ఏమీ చెప్పలేమని కోర్టు అభిప్రాయపడింది.తెలంగాణ పోలీసుల ఎదుట ఆశోక్‌  హాజరుకావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు ఈ కేసు విచారణను  ఈ నెల 20వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.