హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుండి  అక్రమంగా టీఆర్ఎస్‌లో చేరితే ఆ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొనే హక్కు తమకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. కాంగ్రెస్ ఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో మంగళవారం నాడు విచారణ ప్రారంభమైంది.

కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ శాసనసభపక్షంలో విలీనం చేయకుండా అడ్డుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్కలు సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు హైకోర్టు విచారణను ప్రారంభించింది. ఈ పిటిషన్‌పై ఇప్పటికిప్పుడే అత్యవసరంగా  విచారణ చేయాల్సిన అవసరం ఉందా అని హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాది జంద్యాల రవిశంకర్ ను ప్రశ్నించింది.

అయితే ఈ విషయమై జంధ్యాల రవిశంకర్  ఇచ్చిన సమాధానంతో కోర్టు సంతృప్తి చెందలేదు. దీంతో ఈ పిటిషన్‌పై జూన్ 11వ తేదీన విచారణ చేయనున్నట్టు కోర్టు ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచారని.. అంతేకాకుండా కాంగ్రెస్‌ఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూడ కాంగ్రెస్ పార్టీ తరపు న్యాయవాది హైకోర్టులో ప్రస్తావించారు.

అయితే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు అక్రమంగా టీఆర్ఎస్‌లో చేరితే  వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనే హక్కు హైకోర్టుకు ఉందని కోర్టు అభిప్రాయపడింది.