తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. కాగా... డెంగ్యూ నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలో హైకోర్టు సీరియస్ అయ్యింది. మనుషులు చనిపోతున్నా కూడా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

బుధవారం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, మున్సిపల్‌ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్లు, ఇతర ఉన‍్నతాధికారులు గురువారం ఉదయం కోర్టులో హాజరు కావాలంటూ ఆదేశించిన సంగతి తెలిసిందే.

కోర్టు ఆదేశాల మేరకు వారు ఈ రోజు న్యాయస్థానంలో హాజరయ్యారు. వారి ముందు మరోసారి న్యాయస్థానం ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. మూసి నది కారణంగానే డెంగ్యూ వ్యాపిస్తోందని అధికారులు చెప్పిన వ్యాఖ్యలపై కూడా కోర్టు స్పందించింది. ఉన్నతాధికారులు మూసీ నదిని సందర్శించాలని ఆదేశించింది.

చీఫ్ సెక్రటరీ వెంటనే మూసి నదిని సందర్శించాలని పేర్కొన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా నదుల మధ్యనే నగరాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. అక్కడ లేని డెంగ్యూ తెలంగాణలో మాత్రమే ఎందుకు వ్యాపిస్తోందని ప్రశ్నించింది. 30 రోజుల ప్రణాళికలో మీరు ఒరగపెట్టింది ఏమిటని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రణాళికలన్నీ పేపర్లమీదే ఉన్నాయని...వాస్తవరూపంలో ఏమీ లేవని మండిపడింది. మూసీ పక్కనున్న హైకోర్టులోనే దోమలు ఎక్కువగా ఉన్నాయని కోర్టు మండిపడింది. ఈ ఏడాది జనవరిలో 85 డెంగ్యూ కేసులు నమోదైతే.. అక్టోబర్ నాటికి 3,800 కేసులు నమోదయ్యాయని కోర్టు తెలిపింది.  డెంగ్యూ వ్యాధిని అరికట్టడంలో కోర్టు విఫలమైతే... మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు ఇవ్వాలని కోర్టు పేర్కొనడం గమనార్హం. 

కాగా... తెలంగాణలో డెంగ్యూ వ్యాధి విజృంభిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దోమల నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని వైద్యురాలు డా.కరుణ హైకోర్టును ఆశ్రయించారు. 

కరుణ పిటీషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి దోమల నివారణకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను సైతం జారీ చేసింది. అయినప్పటికీ డెంగ్యూ బారినపడి ప్రజలు మరణించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దోమల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది. అయితే గురువారం హైకోర్టులో హాజరుకావాలని ప్రభుత్వానికి ఆదేశించడంపై చర్చ జరుగుతుంది. 

ఇకపోతే డెంగ్యూ బారినపడి తెలంగాణలో ఇప్పటి వరకు 5మంది చనిపోయారు. ఇటీవలె ఖమ్మం జిల్లాలో జూనియర్ సివిల్ జడ్జి జయమ్మ సైతం మరణించారు. డెంగ్యూతో బాధపడిన ఆమె హైదరాబాద్ లోని కిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.