ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi ) కారుపై దుండగులు కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ‌లో (Hyderabad Old City) హై అలర్ట్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi ) కారుపై దుండగులు కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పాతబస్తీ‌లో (Hyderabad Old City) హై అలర్ట్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అసదుద్దీన్‌ కారుపై కాల్పుల ఘటనకు నిరసనగా.. గత రాత్రి నుంచి పాతబస్తీలో ఎంఐఎం నేతల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. పలుచోట్ల నల్ల జెండాలు ఎగరవేశారు. ఈ క్రమంలోనే నేడు శుక్రవారం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గస్తీని పెంచారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను రంగంలోకి దించారు. 

శుక్రవారం ప్రార్థనల తర్వాత చార్మినార్, మక్కా మసీద్ తదితర ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేస్తారనే సమాచారంతో అక్కడ ముందస్తుగా పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. 

పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని, గురువారం ఢిల్లీకి తిరిగివస్తుండగా హపూర్‌–ఘజియాబాద్‌ మార్గంలో ఛిజార్సీ టోల్‌ప్లాజా సమీపంలో ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. సాయంత్రం 6 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు ఒవైసీ స్వయంగా వెల్లడించారు. కాల్పులు జరిపిన వెంటనే ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ‘ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలతో బాధపడ్డామని నిందితులు చెప్పారు. వారిని కోర్టు ముందు హాజరు పరుస్తాము’ అని ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు. వివరణాత్మక విచారణ, సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని తేలిందని ప్రశాంత్ కుమార్ చెప్పారు. కొద్ది గంటల్లోనే ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. ఘటనకు ఉపయోగించిన ఆయుధం, కారు స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. 

ఈ కాల్పుల ఘటనపై సీరియస్ తీసుకున్న కేంద్ర హోం శాఖ అసదుద్దీన్‌కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్ భద్రతపై సమీక్ష జరిపిన కేంద్ర హోంశాఖ.. సీఆర్పీఎఫ్‌తో జెడ్ కేటగిరి భద్రతా కల్పించాలని నిర్ణయం తీసుకుంది. తక్షణమే అసదుద్దీన్‌కు ఈ భద్రత అమల్లోకి రానుంది. 

ఇక, ‘నేను మీరట్‌లోని కితౌర్‌లో ఎన్నికల కార్యక్రమం తర్వాత ఢిల్లీకి బయలుదేరుతున్నాను. ఛజర్సీ టోల్ ప్లాజా దగ్గర ఇద్దరు వ్యక్తులు నా వాహనంపై 3-4 రౌండ్ల బుల్లెట్లు కాల్చారు. కాల్పులు జ‌రిపిన దుండ‌గులు ముగ్గురున‌లుగురు ఉన్నారు. కాల్పుల కార‌ణంగా నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంపై బయలుదేరాను. అయితే మాకెవరికీ గాయాలు కాలేదు. అలా దయ వల్ల మేము క్షేమంగా ఉన్నాం’ అని అసదుద్దీన్ చెప్పారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.