మాదాపూర్ డ్రగ్స్ కేసు .. ముగిసిన నవదీప్ నార్కోటిక్ బ్యూరో విచారణ
మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ నటుడు నవదీప్ నార్కోటిక్స్ విచారణ ముగిసింది. దాదాపు 6 గంటల పాటు ఆయనను విచారించారు అధికారులు. తాను ఎలాంటి డ్రగ్స్ కొనుగోలు చేయలేదని.. ఎప్పుడూ , ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ మీడియాకు తెలిపారు.

తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో టీమ్ వాళ్లు , సీపీ సీవీ ఆనంద్ , ఎస్పీ సునీతా రెడ్డిలు సక్సెస్‌ఫుల్ టీమ్‌ను క్రియేట్ చేశారని నవదీప్ అన్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆయనను శనివారం నార్కోటిక్ బ్యూరో అధికారులు దాదాపు 6 గంటల పాటు విచారించారు. అనంతరం నవదీప్ మీడియాతో మాట్లాడుతూ.. నార్కోటిక్ బ్యూరో అధికారులు అద్భుతంగా దర్యాప్తు చేస్తున్నారని ప్రశంసించారు. ఏడు ఎనిమిదేళ్ల క్రితం నాటి వివరాలను కూడా ఆరా తీస్తున్నారని నవదీప్ అన్నారు.
పాన్ ఇండియా లెవల్లో టీఎస్ నార్కోటిక్ బ్యూరో సక్సెస్ రేటు చాలా ఎక్కువని కొనియాడారు. గతంలో తనపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్, ఎక్సైజ్ విచారణకు సహకరించానని నవదీప్ గుర్తుచేశారు. ప్రస్తుతం ఏడేళ్ల పాత ఫోన్ రికార్డులను కూడా పరిశీలించి దర్యాప్తు చేశారని చెప్పారు. బీపీఎం క్లబ్‌తో వున్న సంబంధాలపై ఆరా తీశారని.. విశాఖకు చెందిన రామచందర్‌తో తనకు పదేళ్ల నుంచి పరిచయం వుందన్నారు. తాను ఎలాంటి డ్రగ్స్ కొనుగోలు చేయలేదని.. ఎప్పుడూ , ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ స్పష్టం చేశారు. అవసరం వుంటే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు.