హైదరాబాద్: సినీ హీరో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసిన బ్యాంక్ ఉద్యోగిపై హైదరాబాద్ లోని జాబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వివరించారు. 

వసుంధరకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ బంజారాహిల్స్ శాఖలో ఖాతా ఉంది. ఆమె ఇటీవల మొబైల్ యాప్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. దాన్ని నిర్ధారించుకునేందుకు బ్యాంక్ రిలేషన్ షిప్ మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ శనివారంనాడు ఆమెకు ఫోన్ చేశారు. 

యాప్ కోసం తాను తాను ఏ విధమైన దరఖాస్తు కూడా ఇవ్వలేదని ఆమె సమాధానం ఇచ్చారు. దాంతో దరఖాస్తు ఫారాలపై సంతకం చేసింది ఎవరనే కోణంలో వారు విచారణ జరిపారు. బ్యాంక్ లో కొత్తగా చేరిన అకౌంటెంట్ కొర్రి శివ ఆ పని చేసినట్లు తెలుసుకున్నారు. అతనే వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించుకున్నారు. 

ఆ విషయాన్ని వసుంధరకు చెప్పడంతో వసుంధర తరఫున ఆర్థిక లావాదేవీలు చూసే వెలగల  సుబ్బారావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.