హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో సోమవారం సాయంత్రం కురిసిన గాలి వాన బీభత్సం సృష్టించింది. ఆకస్మాత్తుగా వీచిన గాలులకు నగరం అంతా వణికిపోయింది. ఫ్లడ్ లైట్ టవర్లు, హోర్డింగ్ లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. 

ఈదురుగాలుల ధాటికి ఎల్బీస్టేడియంలో ఫ్లడ్‌లైట్ టవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. టవర్ మీద పడటంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

టవర్లు కుప్పకూలడంతో డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు చేపట్టాయి. ఫ్లడ్ లైట్ టవర్ కుప్పకూలడంతో ఒకరు మృతిచెందడంతోపాటు పలు వాహనాలు, కార్లు ధ్వంసం అయ్యాయి. 

ఇకపోతే ఎన్టీఆర్ స్టేడియంలో కూడా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈదురుగాలుల ధాటికి ఎగ్జిబిషన్ షెడ్ కుప్పకూలిపోయింది. షెడ్డుకింద కూలీలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. 

మరోవైపు ఈదురుగాలుల బీభత్సానికి వర్షం తోడవ్వడంతో నగరంలో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చీకట్లో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

మరోవైపు కేపీహెచ్ బీ కాలనీలో భారీ వృక్షం నేలమట్టమైంది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్ సమీపంలోని మారేడుపల్లిలో భారీవృక్షం నేలకొరిగింది. దాంతో మూడు కార్లు పూర్తిగా ధ్వసం అయ్యాయి.