భారీ వర్షం ధాటికి హైదరాబాద్ చివురుటాకులా వణికిపోతోంది. కొద్దిరోజుల క్రితం జరిగిన బీభత్సం నుంచే జనం ఇంకా బయటపడేలేదు. ఇప్పుడు శనివారం కురిసిన తాజా వర్షంతో మరోసారి నాలాలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.

లష్కర్‌గూడా చెరువు ఉద్ధృతికి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ ప్రాంతంలో జాతీయ రహదారిపై వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటం, రోడ్డు దెబ్బతినడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

దీంతో 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వరద నీటి కారణంగా నిలిచిపోయాయి.

శనివారం చేపట్టిన రహదారి మరమ్మత్తులు సైతం వరద కారణంగా ఆగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై గగన్‌పహాడ్‌ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

దీంతో ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ట్రాఫిక్‌ మళ్లించారు. ఆదివారం ఉదయం గగన్‌పహాడ్‌ వద్ద జాతీయ రహదారిని, గగన్‌పహాడ్‌ చెరువు, అప్ప చెరువు, పల్లె చెరువును సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు.