తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనం ఎండవేడి తట్టుకోలేక మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో రద్దీ కనిపిస్తోంది. 

హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే సూర్యుడు భగభగమండిపోతున్నాడు. దీంతో జనం గడప దాటాలంటే భయపడిపోతున్నారు. ఎండ వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు జనం కూల్‌డ్రింక్‌లు, ఐస్‌క్రిములు, కొబ్బరి నీళ్లు ఇతర శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వెళ్లే వారు పెరిగిన ఎండల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్లు వున్న వారిని పక్కనబెడితే.. బస్సులు, ఆటోలను ఆశ్రయించే సామాన్యుల చూపు మెట్రోపై పడింది. వేగంగా , సురక్షితంగా, సుఖవంతంగా ప్రయాణం వుండటంతో జనం మెట్రో స్టేషన్‌లకు పరుగులు తీస్తున్నారు. దీంతో గడిచిన వారం రోజుల నుంచి అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో రద్దీ కనిపిస్తోంది. రోజుకు ఇక్కడ నుంచి 4.50 లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

అయితే మెట్రోలో కెపాసిటీకి మించి ప్రయాణీకులు ప్రయాణిస్తుండటంతో సర్వీసులను పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ఎండలను దృష్టిలో వుంచుకుని సర్వీసులను పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మిగిలిన ప్రజారవాణాతో పోల్చితే మెట్రోలో ఛార్జీలు కాస్త ఎక్కువై అయినప్పటికీ.. చల్లదనం , ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం మెట్రోలను ఇష్టపడుతున్నారు. అయితే రానున్న రోజుల్లో మెట్రోలలో ప్రయాణించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది. అయితే మెట్రోలో రద్దీని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ పలువురు ప్రయాణీకులు మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా కోరుతున్నారు. 

Also Read: తెలంగాణలో మండుతోన్న ఎండలు .. 17 రోజుల్లో ఏకంగా కోటి బీర్లు తాగేశారుగా

మరోవైపు.. ఎండల ధాటికి తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడవుతున్నాయి. ఏప్రిల్ 17 వరకు ఒక్క హైదరాబాద్‌లోనే 1.01 కోట్ల బీర్లు అమ్ముడుపోయినట్లు అబ్కారీ శాఖ చెబుతోంది. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలో కలిపి 8,46,175 బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. సగటున రోజుకు 6 లక్షల బీర్లు అమ్ముడుపోయాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో 1,94,351 కేసుల బీర్లు, రంగారెడ్డలో 5,59,746, మేడ్చల్ జిల్లాలో 92,078 కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలకు నిత్యం బీరు సరఫరా చేస్తోంది. వచ్చే రెండు నెలల్లో బీర్ల విక్రయాలు రికార్డులు సృష్టించే అవకాశం వుందని చెబుతున్నారు.