తెలంగాణ లో భారీ వర్షాలు, కళకళలాడుతున్న ప్రాజెక్టులు

heavy rains in telangana
Highlights

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. వర్షాకాలం మొదట్లో కాస్త పరవాలేదనిపించినా వరుణుడు మద్యలో మొహం చాటేసి ఆందోళన కలిగించాడు. అయితే సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు వరుణుడు  కరుణించాడు. తెలంగాణ తో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులన్ని జలకళను సంతరించుకున్నాయి. 
 

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకున్నాయి. వర్షాకాలం మొదట్లో కాస్త పరవాలేదనిపించినా వరుణుడు మద్యలో మొహం చాటేసి ఆందోళన కలిగించాడు. అయితే సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు వరుణుడు  కరుణించాడు. తెలంగాణ తో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులన్ని జలకళను సంతరించుకున్నాయి. 

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. కొమురం భీం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు, ప్రాణహిత నదులు పొంగిపొర్లుతున్నాయి. దహేగాం మండలంలోని గిరిపల్లి ప్రాంతంలో ఎర్రవాగు పొంగిపోర్లుతుండటంతో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కౌటాల, బెజ్జూరు, దహేగాం, పెంచికలపేటలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్ఫం కురుస్తూనే ఉంది.  బోథ్ మండలం పొచ్చెర జలపాతంలోకి వరద నీరు భారీగా వస్తుంది. కుంతాల జలపాతం వద్ద వరదనీరు పైనుంచి కిందకు దూకుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పెన్‌గంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది.


 ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉరకలేస్తున్నాయి. కొత్తగూడెం పరిధిలోని చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 72.50 మీటర్లుగా ఉంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుత ఇన్ ప్లో 3,700 క్యూసెక్కులుగా ఉంది.

మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉదృతి పెరుగుతోంది.ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 141.51 మీటర్లకు చేరింది. ఇక భూపాలపల్లి జిల్లాలోని  మోరంచ వాగు కూడా ఈ వర్షపు నీటితో నిండుకుండలా మారింది.దీంతో గణపురం,ధర్మారావుపేట గ్రామాలు నీట మునిగాయి. ఈ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర అవస్తలు పడుతున్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద 2,56,700 క్యూసెక్కుల ప్రవాహంతో గోదావరి ఉదృతరూపాన్ని దాల్చింది. ఇక్కడ గోదావరి 7.8 మీటర్ల లోతుతో ప్రవహిస్తున్నది. అన్నారం వద్ద 4230 క్యూసెక్కుల వరద నీటితో గోదావరి పరుగులు పెడుతోంది. 

తెలంగాణ లో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తుండగా మరో రెండు రోజుల్లో భారీ నుండి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మంత్రులంతా తమ జిల్లాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని కోరారు. జిల్లా కలెక్టర్లు స్థానికంగా ఉండే అధికారులను సమన్వయ పరుస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని సీఎం ఆదేశించారు. మంత్రులను తమ తమ జిల్లాల్లోని సరిస్థితులను సమీక్షించాలని ఆదేశించడంతో ఇవాళ జరగాల్సిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
 

loader