అమరావతి: భారీ వర్షాలతో ఇప్పటికే అతలాకుతలం అయిన తెలంగాణ రాష్ట్రానికి మరోసారి వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరింది. మంగళవారంతో పాటు మరో రెండు రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ సాయం కోరగా వెంటనే స్పందించిన ఆ రాష్ట్ర సీఎం జగన్.  వెంటనే తెలంగాణకు కావాల్సిన సాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

సీఎం ఆదేశాలతో ఏపీ విపత్తు నిర్వహణ శాఖ, పర్యాటక శాఖ కు చెందిన ఎనిమిది స్పీడ్ బోట్లు తెలంగాణకు రానున్నారు. ఇవి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉపయోగించనున్నారు. బోట్లతో పాటు కొందరు సిబ్బంది హైదరాబాద్ తమ సేవలను అందించనున్నరు. భారీగా నీటిప్రవాహం వుండే ప్రాంతాల ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు లైవ్ జాకెట్లను కూడా ఏపీ ప్రభుత్వం తెలంగాణకు పంపిస్తోంది. ఇవాళ్టి నుండి ఈ ఎనిమిది స్పీడ్ బోట్లు రంగంలోకి దిగనున్నాయి. 

  హైదరాబాద్ కు ఇంకా తీరని కష్టాలు.. మరో మూడు రోజులు ముప్పు..

రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సోమవారం  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయం తీసుకొన్నామని ఆయన చెప్పారు.

భారీ వర్షాలతో ఇప్పటివరకు 33 మంది మరణించారని ఆయన చెప్పారు. ఇంకా ముగ్గురి ఆచూకీ కోసం  ప్రయత్నిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంతాల నుండి వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను యుద్ధప్రాతిపదికన  కూల్చివేస్తున్నామని ఆయన తెలిపారు.

హైద్రాబాద్ చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైందన్నారు. సుమారు వందేళ్ల తర్వాత హైద్రాబాద్ నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. 80 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించామని ఆయన తెలిపారు.  ఇప్పటికే 50 బోట్లను సిద్దం చేశామని ఆయన చెప్పారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ప్రయత్నించామన్నారు. 

నాలాలు,చెరువులు  కబ్జాకు గురయ్యాయన్నారు. నాలాల కబ్జా ఏదో ఒకరోజు మాత్రమే జరిగింది కాదన్నారు. నగరంలోని 30 కాలనీలు  ఇంకా నీటిలోనే ఉన్నాయని చెప్పారు. ఆర్మీకి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి  సమాచారం ఇచ్చామని ఆయన తెలిపారు. అవసరమైతే హెలికాప్టర్లను కూడ సిద్దం చేసుకోవాలని సూచించామన్నారు.

బోట్ల కోసం ఇప్పటికే ఏపీ రాష్ట్రంతో తాము సంప్రదించినట్టు ఆయన తెలిపారు.1903లో 43 సెంమీ. 1916లో 160 సెంమీ. వర్షపాతం నమోదైందని ఆయన గుర్తు చేశారు. అసాధారణ పరిస్థితుల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. విశ్వనగరాలుగు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు.