హైదరాబాద్: హైద్రాబాద్‌లో పలు చోట్ల సోమవారం నాడు భారీ వర్షం కురిసింది. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం నాడు సాయంత్రం  ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆ తర్వాత భారీ వర్షం మొదలైంది. వేసవితాపంతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఊరటను ఇచ్చింది.వర్షం కారణంగా నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా విద్యుత్  సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ రెండో వారంలో  నైరుతి రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో  వర్షాలు కురిసే అవకాశం ఉంది.నైరుతి రుతుపవనాలు రాకముందే ఈ వర్షాలు కురవడంపై  హైదరాబాద్ వాసులు కాస్త ఊరట చెందారు.