గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచకల్ పేట్ మండలం ఎల్లూరు గ్రామ సమీపంలోని బొగ్గి వాగులో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగింది.

దీంతో ఉదయం నీటి ప్రవాహం లేని సమయంలో పొలం పనులకు వెళ్లిన 60 మంది ఎల్లూరు  గ్రామానికి చెందిన రైతులు, కూలీలు వూరికి అవతల వైపున చిక్కుకుపోయారు. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు, కూలీలు బొగ్గి వాగులో వరద ఉద్ధృతి పెరగడాన్ని గమనించలేదు.

Also Read:వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు: హెలికాప్టర్ పంపిన కేటీఆర్, కేసీఆర్ ఆరా

తీరా పొలం పనులు పూర్తయ్యాకా.. ఇంటికి వెళ్లేందుకు వాగు దగ్గరకు వస్తే అది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగును దాటేందుకు చాలా మంది సాహసించలేదు. అయితే 60 మందిలో చివరికి 20 మంది ధైర్యం చేసి వాగు దాటేందుకు ప్రయత్నించారు.

ఒకరికొకరు చేతులు పట్టుకుని భారీగా వున్న వరద ప్రవాహంలోనే అతికష్టం మీద వాగు దాటారు. నీటి ఉద్థృతి అంతకంతకూ పెరుగుతుండటంతో 40 మంది రైతులు, కూలీలు వాగు దాటేందుకు భయపడుతున్నారు.

వారిని కూడా ఎలాగైనా వాగును దాటించి వూరిలోకి తీసుకువచ్చేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఒడ్డుకు అవతలి వైపున వున్న వారిని రక్షించలేకపోతే సహాయక బృందాలకు సమాచారం అందించాలని వారు భావిస్తున్నారు.