శనివారం ఉదయం నుంచి హైదరాబాద్ ను వర్షం పట్టుకుంది. తెల్లవారుజామునే ఉరుములు, మెరుపులతో మొదలైన భారీ వర్షం ఇంకా మూడు గంటలు కొనసాగే అవకాశం ఉంది. దీంతోపాటు వడగండ్లు పడతాయని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. శనివారం తెల్లవారుజాము నుంచే ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం కురుస్తోంది. వీకెండ్ నాడు ఉదయాన్నే వర్షం హైదరాబాదు వాసుల్ని పలకరించింది. అనుకోని ఈ వర్షానికి హైదరాబాదులోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉదయాన్నే ఆఫీసులకు బయలుదేరిన వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో నగరవాసులకు జిహెచ్ఎంసి హెచ్చరికలు జారీ చేసింది.
నగరంలోని.. పంజాగుట్ట, ఎల్బీనగర్, అమీర్ పేట్, కోఠి, ఉప్పల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, హయత్ నగర్, బేగంపేట్, అడ్డగుట్ట, వారాసిగూడ ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం కురుస్తుంది. దీంతోపాటు.. నగర శివారు జిల్లాల్లోనూ విపరీతంగా వర్ష ప్రభావం కనిపిస్తుంది. శనివారం ఉదయాన్నే మొదలైన ఈ వర్షం మరో మూడు గంటల పాటు ఇలాగే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
నకిలీ ఐపీఎల్ టికెట్లు.. బార్‌కోడ్‌తోనే దందా , సూత్రధారి ఇతనే : రాచకొండ సీపీ
వర్షంతో పాటు.. వడగండ్లు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచిస్తుంది. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు, ఐదు రోజులపాటు భారీ వర్షాలు, వడగండ్ల వానలు ఉంటాయని వాతావరణ శాఖ ఇంతకుముందే పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే శనివారం ఉదయమే జంట నగరాలను వాన పలకరించింది. తెల్లవారినా కూడా మబ్బులు కమ్ముకుని, చిమ్మ చీకటి అలుముకుంది. దీంతోపాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. వడగండ్ల వానలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోనే కాకుండా.. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు, వడగండ్లకు అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు రామచంద్రపురం అమీన్పూర్ లో భారీ వర్షం కురుస్తోంది మహబూబ్నగర్లో కూడా పిడుగులకు కూడిన భారీ వర్షం పడుతోంది. రంగారెడ్డి, యాదాద్రి, మేడ్చల్ జిల్లాలకు వడగండ్లతో కూడిన భారీ వర్షం హెచ్చరికలు జారీ అయ్యాయి.
హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయి... ఇళ్లముందు పార్క్ చేసిన వాహనాలు ఆ వర్షంలో కొట్టుకుపోతున్నాయి. వీటిని సంబంధించి కొన్ని వీడియోలను ట్విట్టర్ యూజర్లు ఇలా పంచుకున్నారు.
