గత మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలను కకావికలం చేస్తున్న వాయుగుండం బలహీనపడకుండా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణపై కొనసాగుతోంది.

వాయుగుండం భూ భాగంపైకి వచ్చినా బలహీనపడకుండా స్థిరంగా వున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది కర్ణాటకలోని గుల్బర్గాకు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై పశ్చిమ వాయువ్యదిశగా 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.

ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణశాఖ భావిస్తోంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆరేబియా సముద్రంపైకి వెళ్లనున్నట్టు వాతావరణశాఖ అంచనా వేస్తోంది.   

Also Read:ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో: స్టేషన్ కింద పిల్లర్ వద్ద కుంగిన భూమి

16వ తేదీ నాటికి అరేబియా సముద్రంపైకి వెళ్లిన అనంతరం అల్పపీడన ప్రాంతం మళ్లీ వాయుగుండంగా మారే అవకాశముందని, అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ మహారాష్ట్ర-గుజరాత్‌‌కు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

వాయుగుండం ప్రభావంతో తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని షోలాపూర్‌, విదర్భ, మరాట్వాడ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో 15వ తేదీ నుంచి మధ్య మహారాష్ట్ర, కొంకణ్‌, గోవా, కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.  

మరో వైపు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

పాతబస్తీలో భారీ వర్షాలకు ఇల్లు కూలి 9మంది మృతి చెందారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు.