బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో వర్షం దంచికొడుతుంది. శని, ఆదివారాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో వర్షం దంచికొడుతుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. ఇక, తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో పాటు, తెలంగాణ‌పై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా రెండు రోజులుగా హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 20.90 సెం.మీల వర్షంకురిసింది. 

ఇక, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో శనివారం అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోసారి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

మరోవైపు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోని అనేకచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శని, ఆది వారాల్లో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇక, భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంటకు నష్టం చేకూరుతుంది. 

ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం శనివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనుందని వాతావరశాఖ తెలిపింది. దీంతో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.