దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. 

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు మధ్యాహ్నం పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండల తీవ్రత అధికంగానే ఉంది. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఓ వైపు ఎండలు.. మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు కదలడం లేదు.

తెలంగాణలో బుధవారం అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని జైసద్‌లో 45.7, జగిత్యాలలోని ఐలాపూర్‌ 45.1 డిగ్రీల సెల్సియన్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాలో కూడా ఎండ తీవ్రత అధికంగానే ఉంది. ఇక, గురు, శుక్ర వారాల్లో తెలంగాలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నట్టు చెప్పారు. 

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కొన్నిచోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. శనివారం నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. 

మరోవైపు ఏపీలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లా రెంటచింతల నిప్పుల కుంపటిని తలపిస్తుంది. ఇక్కడ బుధవారం 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత అత్యధికంగా కర్నూలులో 43.4 డిగ్రీలు, అనంతపురంలో 43.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి, అమరావతి, నందిగామ, కడప, మార్కాపురం, పాతపట్నంలలో.. 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు గురు, శుక్ర వారాల్లో రాయలసీమ, కోస్తాల్లోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 

ఎండ తీవ్రత నుంచి ఉపశమనం నుంచి పొందుందేకు జనాలు శీతాల పానీయాలు, కొబ్బరిబొండాలు, పండ్ల రసాలను ఆశ్రయిస్తున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్దుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.