Telangana : తెలంగాణ‌లో ఎండ‌లు మండిపోతున్నాయ‌నీ, హీట్ వేవ్ కోవిడ్-19 పరిస్థితిని పోలి ఉందని, ప్రజలు సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని DPH శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12-3 గంటల మధ్య బయటకు వెళ్లవద్దు, ఈ స‌మ‌యంలో ఎండ తీవ్ర‌త మ‌రింత అధికంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు.  

heatwave in Telangana : రాష్ట్రంలో వేడిగాలుల (ఎండ తీవ్ర‌త‌) పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బ‌య‌ట‌కు (బహిరంగ ప్రదేశాల్లోకి) వెళ్లవద్దని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. రోజువారీ వేతన కార్మికులు, క్షేత్రస్థాయి కంపెనీ సేల్స్ టీమ్‌లు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు మరియు ట్రాఫిక్ సిబ్బంది, ఫీల్డ్ జర్నలిస్టులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు హైరిస్క్ గ్రూపులో ఉన్న‌వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. వ‌డ‌దెబ్బ త‌గ‌ల కుండా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. 

రాష్ట్రంలో ఇప్ప‌టికే ఎండ‌లు దంచి కొడుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) వెల్ల‌డించిన డేటా ప్రకారం.. ఏప్రిల్ 1-2 తేదీలలో హీట్‌వేవ్ పరిస్థితుల కారణంగా హైదరాబాద్ మరియు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు కూడా వడదెబ్బ హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం.

వడదెబ్బ బాధితులపై నిఘా ఉంచేందుకు రాష్ట్రంలోని వైద్యారోగ్యశాఖ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, నిఘా బృందాలను ఏర్పాటు చేశామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి శ్రీనివాసరావు వెల్ల‌డించారు. “ఈ బృందాలు బాధితులకు అత్యవసర వైద్య సంరక్షణను కూడా అందిస్తాయి. ప్రజారోగ్య కేంద్రాలతో పాటు ప్రభుత్వ ఆస్ప‌త్రుల్లో ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఐవీ ఫ్లూయిడ్‌లు, ఇతర ప్రాణాలను రక్షించే అత్య‌వ‌స‌ర మందులు సరిపడా నిల్వలు ఉన్నాయని ఉన్నాయ‌ని మీడియా స‌మావేశంలో ఆయ‌న అన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు, వేడిగాలుల ప్రభావాన్ని తగ్గించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 'చలివేంద్రాలు' (ఉచిత నీటి సరఫరా కేంద్రాలు) ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

వ‌డ‌దెబ్బ ప్ర‌భావం క్ర‌మంగా పెరిగి.. మరణానికి దారితీయవచ్చు. అందుకే ఎండ తీవ్ర‌త అధికంగా ఉంది కాబ‌ట్టి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మురికివాడలు, బలహీన వర్గాల కాలనీల్లో ఆరోగ్య సహాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఓఆర్‌టీ (ఓరల్‌ రీహైడ్రేషన్‌ థెరపీ) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్ర‌స్తుత హీట్ వేవ్.. కోవిడ్-19 పరిస్థితిని పోలి ఉందని, ప్రజలు సురక్షితంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. "ప్రజారోగ్య విభాగం సామూహిక సమావేశాలు మరియు బహిరంగ ప్రదేశాలలో వైద్య బృందాల‌ను కూడా ఏర్పాటు చేస్తోంది. అలాగే, తాగునీటి నాణ్యతను పరీక్షించడానికి బృందాలను ఉంచుతారు. నీటి కలుషితాన్ని నివారించడానికి తాగునీటి పైప్‌లైన్‌లలో లీకేజీలు తనిఖీ చేయబడతాయి" అని ఆయన తెలియజేశారు.

ఇక తీవ్రమైన వేడిగాలుల కార‌ణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్‌లో 41.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 41.2 డిగ్రీలు, నల్గొండలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ 40.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతతో వేడిగాలుల పరిస్థితులు నెలకొన్నాయి. మెద‌క్‌, మహబూబ్‌నగర్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో రెండు రోజుల పాటు హీట్ అలర్ట్ ప్రకటించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముంద‌ని తెలిపింది. ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉంది.