హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ భవనం కూల్చివేత అంశంపై తెలంగాణ హైకోర్టులో గురువారం కూడా సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎర్రమంజిల్‌లోని భవనాలన్నీ వారసత్వ కట్టడాల పరిధిలోకి వస్తాయని.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదించారు.

రాష్ట్రం ఇప్పటికే వేల కోట్ల అప్పుల్లో ఉందని.. అవసరం లేకపోయినా, కోట్ల రూపాయల ఖర్చుతో అసెంబ్లీ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం లేదని వారు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై ధర్మాసనం మండిపడింది.. దేశం సైతం లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆపేయడం లేదని వ్యాఖ్యానించింది.

అప్పులు ఉన్నాయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆపాలని తాము ప్రభుత్వాన్ని ఏ విధంగా ఆదేశించగలమని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ అంశం అభివృద్ధికి సంబంధించినది కాదని.. పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

అయితే న్యాయస్థానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు, కేబినెట్ నిర్ణయాల్లో ఏ విధంగా జోక్యం చేసుకోగలదో తమకు వివరించాలని న్యాయవాదులను ఆదేశించింది.

పిటిషనర్లు భవనాలకు తామే యజమానులైనట్లు, నిజాంలైనట్లు వాదించకూడదని, చట్టం పరిధిలోనే వాదించాలని ధర్మాసనం సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రసంగాలు చేసినట్లు కాకుండా న్యాయస్థానంలో హుందాగా ప్రవర్తించాలని చురకలు అంటిస్తూ.. విచారణను రేపటికి వాయిదా వేసింది.