అలా అయితే.. తమిళిసై గవర్నర్ పదవిలో ఉండకూడదు: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ విషయంలో గవర్నర్ తమిళసై తన వైఖరిని మార్చుకోవాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సూచించారు .

తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి షాకిచ్చారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. కొన్నిరోజుల క్రితం.. అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ లను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమించాలని రాష్ట్రప్రభుత్వం చేయగా.. ఆ అభ్యర్థిత్వాల సిఫార్సులను తిరస్కరించారు. దాసోజు, కుర్రాలు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని, అందుకే వారి పేర్లను తిరస్కరించనని తెలిపారు. వారిద్దరూ ఎలాంటి సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన లేదని వెల్లడించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నవారిని సిఫార్సు చేయాలని సూచించారు.
కాగా, గవర్నర్ నిర్ణయంపై మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) స్పందించారు. తెలంగాణ పట్ల గవర్నర్ తీరు మారలేదని, రాష్ట్ర మండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం దారుణమని అన్నారు. వారు బీఆర్ఎస్ సభ్యులుగా ఉన్నారనే కారణంతో వారిని తిరస్కరించడం సరికాదనీ, మరీ పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించవచ్చా? అని మంత్రి హరీశ్ రావు నిలదీశారు.
అలా అయితే.. సర్కారియా కమిషన్ ప్రకారం.. తమిళిసై రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరించరాదని, అసలూ ఆమె ఆ గవర్నర్ పదవిలో ఉండకూడదన్నారు. కానీ ఆమె ఎలా తెలంగాణ గవర్నర్‌గా వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి చెందిన గులాం అలీని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపించలేదా? అని నిలదీశారు.
రాజ్యసభకు నామినేటెడ్ అయినా.. మహేశ్ జఠ్మలానీ, సోనాల్ మాన్ సింగ్, రాకేశ్ సిన్హాలు బీజేపీలో సభ్యులు కారా? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా చేశారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో మరొక న్యాయమా? అని ప్రశ్నించారు. గవర్నర్ తమిళసై బీజేపీ పక్షపాతిగా ఉంటూ.. కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో గవర్నర్ తమిళసై తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు మంత్రి హరీశ్ రావు.