ఇబ్రహీంపట్నంలో నలుగురు మహిళల మృతి: ప్రభుత్వాసుపత్రిలో వైద్య నిపుణుల కమిటీ విచారణ

ఇబ్రహీపంట్నం ప్రభుత్వాసుపత్రిలో నలుగురు మహిళల మృతి ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య నిపుణుల కమిటీ విచారణ చేస్తుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్  వికటించడానికి గల కారణాలపై ఈ కమిటీ విచారణ చేయనుంది. 

Health Expert Team Investigates On Four Women Die After Family Planning Surgery in Ibrahimpatnam

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వా సుపత్రిని  శుక్రవారం నాడు వైద్యశాఖకు చెందిన అధికారుల బృందం పరిశీలించింది. గత నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందారు.  

మొత్తం 34 మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిగాయి. వీరిలో నలుగురు మరణించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసుకున్న వారిలో ఇన్ ఫెక్షన్ కు గురైన నలుగురు మరణించినట్టుగా ప్రాథమికంగా వైద్య నిపుణులు గుర్తించారు.ఈ నివేదికను ప్రభుత్వానికి అందించారు. మరో వైపు  మరణించిన నలుగురు మహిళల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మృతుల పిల్లలను తామే చదివిస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన సర్జన్  లైసెన్స్ ను ఏడాదిపాటు రద్దుచేశారు. మరో వైపు ఇబ్రహీంపట్నం సూపరింటెండ్ శ్రీధర్ పై సస్పెన్షన్ వేటేశారు. మరో వైపు అనస్థీయా ఇచ్చిన డాక్టర్ పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

also read:కారణమిదీ: ఇబ్రహీంపట్నంలో కు.ని. శస్త్రచికిత్స తర్వాత నలుగురు మహిళల మృతి

 ఆగష్టు 25న ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత, రాజీవ్ నగర్ తండాకు చెందిన మౌనిక,  మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ, ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపల్లికి చెందిన  లావణ్య లు  కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత ఈ నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించారు. వాంతులు, విరోచనాలతో ఈ నలుగురు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.  

ఆగస్టు 28న మమత ఆగస్టు 29న  సుష్మ,  ఆగస్టు 30న  లావణ్య, మౌనికలు  చనిపోయారు..ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం ఇవాళ ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో విచారణ నిర్వహిస్తుంది. 

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిగిన రోజున విధుల్లో ఉన్న వారిని  ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విచారణ చేయనుంది.శస్త్రచికిత్సలు నిర్వహించిన గదిని పరిశీలించనున్నారు. శస్త్రచికిత్సలు చేసుకున్న తర్వాత మరణించిన నలుగురు మహిళల ఇంటి వద్ద కూడా నిపుణుల కమిటీ విచారణ చేయనుంది. ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి బాధితులు ఏ రకమైనఆహారం తీసుకున్నారు, ఎప్పటి నుండి అస్వస్థతకు గురయ్యారనే విసయాలపై కమిటీ సభ్యులు ఆరా తీస్తారు. ఈ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్న 30 మంది మహిళలకు నిమ్స్, అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇన్ ఫెక్షన్ తగ్గిన వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు.

.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios