పోలీస్ అంటే చాలు...మనలో చాలామంది భయపడిపోతారు.. ఖాకీ అంటే కర్కశత్వమేనని.. వారికి కొంచెం కూడా జాలి ఉండదని జనం అనుకుంటూ ఉంటారు. అయితే వారి ఖాకీ బట్టల వెనుక వెన్నలాంటి మనసు ఎవరికీ తెలియదు
పోలీస్ అంటే చాలు...మనలో చాలామంది భయపడిపోతారు.. ఖాకీ అంటే కర్కశత్వమేనని.. వారికి కొంచెం కూడా జాలి ఉండదని జనం అనుకుంటూ ఉంటారు. అయితే వారి ఖాకీ బట్టల వెనుక వెన్నలాంటి మనసు ఎవరికీ తెలియదు.
కానీ అది అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. నిన్న తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష సందర్భంగా ఖాకీలు మానవత్వాన్ని చాటుకున్నారు. పరీక్ష రాసేందుకు వెళుతున్న ఓ అభ్యర్థి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
ఈ సమయంలో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ వాహనంలోని పోలీసులు.... అతనికి ప్రథమ చికిత్స చేసి.. తమ వాహనంలో పరీక్షా కేంద్రం వద్ద దింపారు. ఇక మహబూబ్‌నగర్‌లో ఓ మహిళా అభ్యర్థి తన నాలుగు నెలల చిన్నారితో కలిసి పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుంది.
అయితే పాపను లోపలికి అనుమతించరు కాబట్టి.. పరీక్ష రాసి వచ్చేంతవరకు కూతురిని చూసుకోవడానికి బంధువుల అమ్మాయిని తీసుకుని వచ్చింది.. పాపను ఆ అమ్మాయి దగ్గర వదిలి పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లింది. అయితే అలా వెళ్లగానే ఆ పాప గుక్కపెట్టి ఏడవటం ప్రారంభించింది.
ఎంతగా సముదాయించినా ఏడుపు ఆపడం లేదు. ఈ క్రమంలో పరీక్షా కేంద్రం వద్ద విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ముజీబ్ ఉర్ రెహ్మన్ ఆ పాపను తన చేతుల్లోకి తీసుకుని ఆడించాడు.. ఈ తతంగాన్ని రమా రాజేశ్వరి అనే ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
