యాదాద్రి: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కలిగించిన హాజీజ్ పురా హత్యల కేసు విచారణను వేగవంతం పెంచారు. సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో ప్రత్యేకంగా విచారణ జరుపుతున్న పోలీసులు ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డితోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

కేసు విచారణలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి దారుణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి హత్యకేసులో శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు విచారణలో మనీషా అనే యువతిని సైతం తానే అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులకు స్పష్టం చేశాడు. 

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మనీషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పిన కీలక విషయాలను  సీపీ మహేశ్ భగవత్ మీడియాకు తెలియ జేశారు. కేసు దర్యాప్తును మరింత వేగం పెంచినట్లు తెలిపారు. 

హజీపురా గ్రామానికి బస్సు లేకపోవడంతో లిఫ్ట్ లపై వెళ్ళడం గ్రామస్థులకు అలవాటు అని స్పష్టం చేశారు. ఇదే ఆసరాగా తీసుకుని కళాశాలలకు వెళ్తున్న యువతులను, స్కూల్ కి వెళ్తున్న బాలికలను శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ చేసేవాడని స్పష్టం చేశారు. 

అలా లిఫ్ట్ లు ఇస్తూ అందరిని నమ్మించేవాడని తెలిపారు. మనీషా, శ్రావణిలకు పలుమార్లు లిఫ్ట్ లు ఇచ్చి నమ్మబలికాడు. శివరాత్రి రోజున మనీషాను లిఫ్ట్ పేరుతో బైక్ ఎక్కించుకుని ఆ తర్వాత అత్యాచారం చేసి హత్య చేశాడని విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. 

శవాన్ని అతని బావిలోనే పూడ్చి పెట్టినట్లు చెప్పారు. మనీషా హత్య విషయం బయటకు రాకపోవడంతో అలాగే శ్రావణిపై కూడా దారుణానికి ఒడిగట్టాడని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మనీషాకు తల్లిలేదు. తండ్రికి అంతగా ఏమీ తెలియదు. 

ఆమెకు ముగ్గురు అక్కలు ఉండగా పెద్దమ్మాయి పెద్దల చూసిన పెళ్లి చేసుకోగా మిగిలిన ఇద్దరు అక్కలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనీషా కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని చెప్పేది. అలాగే మనీషా ప్రేమించి పెళ్లి చేసుకుందని కుటుంబ సభ్యులు, బంధువులు భావించారు. 

పరువుపోతుందన్న భయంతో మనీషా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదని తెలిపారు. మనీషా హత్య కేసు బయటకు రాకపోవడంతో శ్రావణిని కూడా అదే తరహాలో లిఫ్ట్ ఇచ్చి, అత్యాచారం చేసి హత్య చేశాడని తెలిపారు. 

శ్రావణిని బైక్ ఎక్కించుకుంటున్న దృశ్యాలు సీసీ టీవీలో లభించడంతో శ్రీనివాస్ రెడ్డి దొరికినట్లు తెలిపారు. ఇకపోతే నాలుగేళ్ల క్రితం మిస్సైన కల్పన ఆచూకీపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కల్పన మిస్సింగ్ లో శ్రీనివాస్ రెడ్డి పాత్రపై ఆరా తీస్తున్నట్లు సీపీ మహేశ్ భగవత్్ తెలిపారు.