Harish Rao| సిద్దిపేట జీజీహెచ్ ఆస్పత్రిలో డే కేర్ కీమోథెరపీ సెంటర్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. పేదలకు నాణ్యమైన, ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ముందుకెళ్తుందనీ, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో వైద్య రంగాన్ని బలోవేతం చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
Harish Rao| తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీఠ వేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ మంజూరు చేయగా..అందులో పలు మెడికల్ కాలేజీలు ప్రారంభమని , మరికొన్ని కాలేజీలు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. పేదలకు నాణ్యమైన, ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ముందుకెళ్తుందనీ, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో వైద్య రంగాన్ని బలోవేతం చేసే దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
అందులో భాగంగానే క్యాన్సర్ రోగులకు నాణ్యమైన చికిత్సను అందించాలని, అది కూడా జిల్లా కేంద్రంలోనే కీమోథెరపీ సేవలను అందించాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ కార్పోరేట్ ఆస్ప్రతిలో అందించే సేవలకు ఏ మాత్రం తీసిపోకుండా.. క్యాన్సర్ సేవలను కూడా అలాగే అందిస్తామని చెప్పారు. జిల్లా ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందిస్తున్న విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.
సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సర్వజన ఆసుపత్రిలో డే కేర్ కీమో థెరపీ ప్రత్యేక వింగ్‌ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొట్టమొదటి డే కేర్ కీమో థెరపీ సెంటర్ ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందనీ, సిద్దిపేటతో పాటు ఖమ్మం, కరీంనగర్, వనపర్తి, సిరిసిల్లలో వీటిని మంజూరు చేసుకున్నామని తెలిపారు.
క్రమంగా ఎనిమిది మెడికల్ కాలేజీల్లో, ఆ తర్వాత 33 జిల్లాల్లో వచ్చే మెడికల్ కాలేజీల్లో ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించామని అన్నారు. కేన్సర్ వ్యాధి పేషంట్లు హైదరాబాద్ దాకా వెళ్లకుండానే.. జిల్లాలోనే కీమోథెరపీ సేవలు పొందవచ్చని అన్నారు. ఇకపై ఎంతో దూరం ప్రయాణించి, పని వదులుకొని రెండు మూడు రోజులపాటు కీమో సేవల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండదని అన్నారు. ఎం ఎన్ జే కేన్సర్ ఆసుపత్రిలో నిత్యం శిక్షణ పొందిన ఒక మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్ నర్స్ లు ఉంటారనీ, 60 రకాల మందులను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
ఎంఎంజే, నిమ్స్ ఆసుపత్రులు రిఫర్ చేసిన కేన్సర్ పేషెంట్లు ఇక్కడ కీమో థెరపీ సేవలు పొందవచ్చని కూడా తెలిపారు. ప్రతి పేషెంట్ కి 6 నుండి 8 సైకిళ్ల కీమో అవసరం ఉంటుందనీ, పేషంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒక్కో కీమో సైకిల్ కి 3 నుండి 4 వారాల గ్యాప్ అవసరమని వివరించారు. ఒక్కో సైకిల్ కి కార్పొరేట్ ఆసుపత్రిలో అయితే కనీసం 40 వేల నుండి 50 వేల ఖర్చు అవుతుందనీ, మొత్తంగా 4 లక్షల విలువైన వైద్యాన్ని ప్రభుత్వమే ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 468 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారని.. వీరిలో కొందరికి కీమో థెరపీ అవసరం ఉంటుందని తెలిపారు. నిమ్స్, ఎం ఎన్ జే ఆసుపత్రులు రిఫర్ చేసిన 96 కేసులు ఇక్కడ కీమో సేవలు పొందే అవకాశం కల్పించామని తెలిపారు. అలాగే.. రోగులకు టెలి కన్సల్టేషన్ సేవలు కూడా అందుతాయని తెలిపారు.
కేన్సర్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వం కాన్సర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు తెలిపారు. క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించడం, వారిని కాపాడుకోవడం లక్ష్యంగా పని చేస్తున్నమని తెలిపారు. జిల్లాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి మొబైల్ స్క్రీనింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సగటున సంవత్సరానికి రూ. 100 కోట్లతో కేన్సర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సేవలందిస్తున్నామని తెలిపారు.
\2014-15 లో 69 కోట్లు ఖర్చు చేస్తే, గతేడాది 120 కోట్ల దాకా ఖర్చు చేసామనీ, క్యాన్సర్ చికిత్స పై తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తంగా రు. 800 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. MNJ, నిమ్స్ ఆసుపత్రుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగులకు అవసరమైన చికిత్స అందించుతున్నాయనీ, పెరుగుతున్న అవసరాలకి అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచుకుంటున్నామని అన్నారు. క్యాన్సర్ సోకిన వారిని కాపాడుకునేందుకు అవసరమైన అధునాతన చికిత్సలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వస్తున్నదని తెలిపారు.
తెలంగాణ డయాగ్నొస్టిక్ పథకం ద్వారా జిల్లా స్థాయి లోనే కాన్సర్ ను గుర్తించడానికి అవసరమైన మమ్మోగ్రఫీ , బయాప్సీ వంటి అత్యాధునిక సేవలను అందుబాటులోకి తెస్తున్నామనీ, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పథకం ద్వారా సాధారణ కాన్సర్ వ్యాధులను ప్రాధమిక దశలోనే గుర్తించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రజలలో అవగాహన కల్పించి కాన్సర్ రాకుండా అలవాట్లు మార్చు కోవడం (పొగాకు,సిగరెట్లు మానడం), ప్రాధమిక పరీక్షలు చేయించుకోవడం(రొమ్ము , గర్భాశయం కు సంబంధిత పరీక్షలు) ద్వారా వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ఎదైనా సమస్యలు వస్తే.. త్వరిత గతిన గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచించారు. అలాగే.. క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవితం అలవాటు చేసుకోవాలనీ, మూడింట రెండొంతుల క్యాన్సర్లు మన గతి తప్పిన ఆహార అలవాట్లు, పరిసరాల ప్రభావంతో ముడిపడినవేనని అన్నారు.
